సాదాసీదా నటీనటులతో నిర్మితమైన చిత్రం జాతిరత్నాలు. నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం 17 రోజుల్లో రూ.38 కోట్ల షేర్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ.27 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు మిగిల్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఒక నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. అది ఓవర్సీస్‌లో 1 మిలియన్ క్రాస్ చేయడం. నిజానికి ఇది పెద్ద రికార్డు కాదు కానీ పాండమిక్ తర్వాత మన సినిమాలు విదేశీ మార్కెట్లో విడుదల కావడమే ఘనంగా మారిపోయింది.
అలాంటి సమయంలో అక్కడ విడుదలై విజయం సాధించడం అనేది కలగా మిగిలిపోయింది. బాలీవుడ్ సినిమాలు కూడా కనీస వసూళ్లు సాధించలేకపోయాయి. ఇక ఈ ఏడాది మన దగ్గర సంచలన విజయం సాధించిన క్రాక్, మాస్టర్, ఉప్పెన అలాంటి సినిమాలు కూడా ఓవర్సీస్‌లో చేతులెత్తేశాయి.
ఇలాంటి సమయంలో విడుదలైన జాతిరత్నాలు ఓవర్సీస్‌లో 1 మిలియన్ వసూలు చేసింది. దాంతో తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకు కూడా అక్కడ మళ్లీ హోప్స్ క్రియేట్ చేసింది. అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఈ సినిమాలో నవ్వించాడు. ఏదేమైనా కూడా జాతిరత్నాలు మిలియన్ క్రాస్ చేయడంతో మిగిలిన దర్శక నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు.