గత కొంతకాలంగా ఇండియన్ సినిమాలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే పరిస్థితిలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లుగా తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన 'బాహుబలి', '2.O' వంటి సినిమాలకు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ దక్కింది.
ఇటీవల 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' డైరెక్టర్ జో రుసో కూడా సౌతిండియన్ సినిమా గురించి మాట్లాడారు. 'అవెంజర్స్: ది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తీసిన 'రోబో' సినిమా స్ఫూర్తి అని పేర్కొన్నారు. తాజా ప్రముఖ హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్ కూడా టాలీవుడ్ ప్రముఖులు మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
అంతర్జాతీయ "స్పై" సినిమా తీయడం గురించి చర్చించుకోవడానికి వారిని లంచ్‌కు ఆహ్వానించారు. 2016లో కోలీవుడ్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్యను యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. మహిళల అక్షరాస్యత అభివృద్ధికి సంబంధించి మాట్లాడటానికి బిల్ ఆమెను ఆహ్వానించాడు.
'వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు.. మీరు లాస్ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు నాతో భోజనం చేయడానికి రండి. అప్పుడు ఇంటర్నేషనల్ స్పై సినిమా గురించి చర్చించుకుందాం' అంటూ బిల్ ట్వీట్ చేశారు. దీనితో పాటుగా మరో ట్వీట్‌లో ఏ.ఆర్.మురుగదాస్, మహేశ్ బాబులను కూడా సినిమా చర్చలకు ఇన్వైట్ చేశారు.