సినిమా లెజెండ్ శ్రీదేవి రివెంజ్ థ్రిల్లర్ 'మామ్'లో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఆ చిత్రంలో తన అద్భుత నటనకిగాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. నటిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో తన 300వ చిత్రంగా విభిన్న తరహాలో సాగే 'మామ్'తో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా విశేషంగా అందుకున్నారు.
పోలాండ్, చెక్, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, యూఏఈ తదితర 39 దేశాల్లో 'మామ్'ని విడుదల చేసిన 'జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్' ఇప్పుడు చైనాలో విడుదల చేయనుంది. ఉత్తమ నేపధ్య సంగీతానికి గాను ఏ ఆర్ రెహమాన్ నేషనల్ అవార్డు అందుకున్న 'మామ్' చైనాలో మార్చి 22న విడుదల కానుంది.
నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ... 'మామ్' ప్రాంతాలకి అతీతంగా ప్రతి తల్లి, ప్రేక్షకుడిని కదిలించే చిత్రం. ఎంతో అందంగా రూపొందిన శ్రీదేవి చివరి చిత్రమైన 'మామ్'ని తన జ్ఞాపకంగా అందరికీ అందించాలన్నదే మా లక్ష్యం. 'మామ్'తో జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వారు మొదటి నుండి ఉన్నారు. సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా వారు ఈ చిత్రాన్ని ప్రపంచ నలుమూలలకీ తీసుకెళ్లడం ఎంతో ఆనందంగా ఉంది." అన్నారు.
జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ హెడ్ విభా చోప్రా మాట్లాడుతూ... " శ్రీదేవి అద్భుతమైన నటి. ఆవిడ పోషించిన పాత్రలు మనతో చిరస్థాయిగా ఉండిపోతాయి. అందుకు 'మామ్' ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడ విడుదలైనా ఈ చిత్రానికి అద్భుత స్పందన వస్తోంది. ఆవిడ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ హార్ట్ టచింగ్ ఫిలింని చైనాలో విడుదల చేయడం చాలా గర్వంగా ఉంది" అన్నారు.
రవి ఉద్యావర్ దర్శకత్వంలో, ఏ ఆర్ రెహమాన్ సంగీతంతో తెరకెక్కిన 'మామ్' భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నిటిలో సంచలనం సృష్టించింది. 75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భాగంగా 'మామ్'ని ప్రదర్శించడం విశేషం.