Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Sr NT Rama Rao.. జోహార్ ‘నటరత్నం’.. జోహార్ ‘తెలుగుతేజం’..

Sr NT Rama Rao.. జోహార్ ‘నటరత్నం’.. జోహార్ ‘తెలుగుతేజం’..
, సోమవారం, 18 జనవరి 2021 (12:31 IST)
NTR
మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం, ఏ ప్రాంతంలో పుట్టాం, ఏ జాతిలో పుట్టాం అన్నది ముఖ్యం కానే కాదు. కానీ.. ఆ ప్రాంతానికి, ఆ జాతికి మనం ఏమి చేశాం, వారిలో ఎంత స్ఫూర్తిని నింపాం, వారిని ఎంత చైతన్యవంతం చేశాం, వారికి ఎలా దిశానిర్దేశం చూపే మార్గదర్శకులం అయ్యి మరణించాం అన్నది ముఖ్యం. 
 
అటువంటి పుట్టుక, మరణం ఆయాచితంగా ప్రతి ఒక్కరికీ రావు. స్వయాన ఆ దేవుడే తలచుకుని తన దూతగా ఈ విశ్వంలోకి పంపితేనే అది సాధ్యమవుతుంది. అటువంటి కా’రణ’జన్ముడు, యుగపురుషుడే.. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న' మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు. 
 
ఆయన దివ్యమోహన రూపం సాంఘీక చలనచిత్రాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నివ్వడమేగాక, హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన.. మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడటమేగాక, ‘తెలుగు భాష’ తియ్యదనాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే ‘తెలుగు పలుకు’లను తన వాక్పటిమతో కొత్తపుంతలు తొక్కించారు. 
 
అంతేకాకుండా ‘ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించి, అపరిమితమైన ‘ఆత్మవిశ్వాసం’తో ఢిల్లీ గద్దెతో మడమ తిప్పని పోరాటం చేసి, ‘తెలుగు జాతి’లో ఒక మహత్తర రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ‘తెలుగు’వారి పౌరుషాన్ని దశదిశలా చాటి, అప్పటిదాకా ‘మదరాసీ’లుగా పిలవబడుతున్న ‘తెలుగు జాతి’కి ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ‘తెలుగు జాతి’ని సగర్వంగా ప్రపంచానికి పరిచయమూ చేశారు.
 
ఆ ‘అవిశ్రాంత యోధుడు’ సరిగ్గా 25 ఏళ్ళ కిందట 18, జనవరి 1996న మరో మహత్తర కార్య సాధన కోసమై ఈ భువి నుండీ దివికేగాడు. అప్పటి నుండీ ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రతీ ‘తెలుగు’వాడూ బాధాతప్త హృదయాలతో, ఆ ‘మహనీయుడు’ని స్మరించుకోవటం అనేది తమ జాతినీ, తమ భాషనీ మరియూ తమని తాము గౌరవించుకున్నట్లగా భావిస్తూ వస్తున్న సందర్భంగా..
 
జోహార్ ‘నటరత్నం’..
జోహార్ ‘తెలుగుతేజం’..
జోహార్ ‘విశ్వవిఖ్యాతం’..
జోహార్‌ ‘ఎన్‌. టి. ఆర్‌’..
అంటూ మరొక్కసారి ఎలుగెత్తి చాటాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
‘ఆయన’ వీరాభిమాని,
వైవిఎస్ చౌదరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ల‌య‌న్ - టైగ‌ర్‌"ల క్రాస్ బ్రీడ్ 'లైగ‌ర్'