ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు?.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై నటి ఫైర్

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (12:01 IST)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌పై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహుజా కడిగిపారేశారు. విద్యావంతులే విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ నటి తీవ్రంగా తప్పుబట్టారు. 
 
ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్‌ భగవత్‌.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. 
 
ముఖ్యంగా బాగాచదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి అని మోహన్ భగవత్ అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ మండిపడ్డారు. తన ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించారు. 'ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు' అంటూ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హీరో శ్రీకాంత్‌కు పితృవియోగం...