యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం `మ్యూజిక్ స్కూల్`. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. జోధా అక్బర్ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్ ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తున్నారు. అక్టోబర్ 15న మ్యూజికల్ ఈవెంట్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఉన్న విద్యావిధానంలో పిల్లలు కేవలం డాక్టర్స్, ఇంజనీర్స్ మాత్రమే కావాలంటూ తెలియని ఓ ఒత్తిడికి లోనవుతున్నారు. వీటన్నింటిని తెలియజేసి, అందరినీ ఆలోచింప జేసేలా తెరకెక్కబోతున్న ఈ మూవీలో 12 పాటలుంటాయి. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ కామిక్ మ్యూజికల్ జర్నీ ఎవరైతే ప్రేమ, కలలు కనడం, నవ్వడం, పాటలు పాడాలనుకునే వారి కోరికను ప్రతిధ్వనించేలా ఉంటుంది.
ఈ సందర్భంగా నటుడు శర్మన్ జోషి మాట్లాడుతూ ``పాపారావుగారు దర్శకత్వంలో రూపొందనున్న ఈ `మ్యూజికల్ స్కూల్` చిత్రంలో భాగం కావడంపై ఎగ్జయిటింగ్‌గా ఉంది. తొలిసారి మాస్ట్రో ఇళయరాజాగారితో వర్క్ చేయబోతున్నాను కూడా. ఇలాంటి ఓ గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. శ్రియాశరన్‌తో కలిసి వర్క్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణమని నాకు తెలుసు. ఎన్నో భావోద్వేగాల కలయికతో ఉన్న సంగీత ప్రవాహం. ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
శ్రియా శరన్ మాట్లాడుతూ, ``మనందరికీ ఇళయరాజాగారు ఓ ఇన్‌స్పిరేషన్. ఆయనతో కలిసి పనిచేయనుండటం, నా కల తీరినట్లుగా ఉంది. అలాగే లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌తో కలిసి పనిచేయడం కూడా కలలాగా అనిపిస్తుంది. నేను లండన్ వెళ్లిన ప్రతిసారి అక్కడ జరిగే మ్యూజికల్స్ అన్నింటికీ హాజరవుతుంటాను. వేదికపై పెర్ఫామ్ చేయడాన్ని, డాన్స్ చేయడాన్ని నేనెంతగానో ఇష్టపడతాను. నేను కథక్ డాన్సర్‌ను. మరో డాన్స్ కళను నేర్చుకోబోతుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. నా ప్రార్థనలు ఫలించినట్లు అనిపిస్తున్నాయి. కలలో ఉంటున్నట్లు ఉంది. ఇలాంటి గొప్ప అవకాశం రావడం అదృష్టం. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
పాపారావు బియ్యాల న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో వర్క్ చేశారు. ఆయన తెరకెక్కించిన `విల్లింగ్ టు శాక్రిఫైజ్`. ఓ జాతీయ అవార్డును, రెండు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సందర్భంగా.. ఇళయరాజాగారితో కలిసి పనిచేయడం అదృష్టమని, గౌరవంగా భావిస్తున్నానని, అలాగే ఇళయరాజాగారి సంగీతం, పాటలు హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రేను ఆకట్టుకోవడంతో ఆయన ఈ సినిమా పనిచేయడానికి అంగీకరించారని.. దర్శకుడు పాపారావు బియ్యాల తెలిపారు.
సందర్భానుసారం సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌గా వచ్చే మూడు పాటలు ఈ సినిమాలో ఉన్నాయి.