తమిళ హీరో విజయ్ తాజా చిత్రం "సర్కార్". ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల ఆరో తేదీన అంటే దీపావళి పండుగ సందర్భంగా విడుదలై టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
అయితే, ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు అధికార అన్నాడీఎంకేతో పాటు ఆ పార్టీ అధినేత్రి దివంగత జయలలితను ఉద్దేశించి ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను కించపరిచేలా ఉన్నాయని సదరు పార్టీలకు చెందిన వ్యక్తులు మండిపడుతున్నారు.
ఈ మేరకు ఆ పార్టీ కార్యకర్తలు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కార్ థియేటర్లు వద్ద దాడికి దిగారు. అలాగే, అనేక థియేటర్లలో చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. దక్షిణాది జిల్లాల్లో గురువారం రాత్రి అనేక థియేటర్లలో రాత్రిపూట ప్రదర్శనలను రద్దు చేశారు.
విజయ్ కటౌట్‌లను ధ్వంసం చేసి.. సినిమా పోస్టర్లను చింపేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు మురగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసం వద్దకు వెళ్లగా, ఆ సమయంలో మురుగదాస్ ఇంట్లో లేరు.
మరోవైపు, అన్నాడీఎంకే శ్రేణులు దాడికి దిగవొచ్చన్న వార్తల నేపథ్యంలో మురుగదాస్ ఇంటికి చెన్నై నగర పోలీసులు గట్టి భద్రతను కూడా కల్పించారు. మొత్తంమీద ఏఆర్ మురుగదాస్‌ను ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.