బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం అయిన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో అనుమతి లేకుండా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. నటుడి ఇంట్లో భద్రతా లోపాలు ఉన్నాయనే ఆందోళనలను మళ్ళీ రేకెత్తించింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇషాగా గుర్తించబడిన ఆ మహిళను అదుపులోకి తీసుకుని ఆమెను ప్రశ్నించారు. పోలీసుల విచారణ సమయంలో, సల్మాన్ ఖాన్ తనను ఆహ్వానించాడని ఆమె పదే పదే చెప్పింది. తాను ఖార్ ప్రాంతంలో నివసిస్తున్నానని, ఆరు నెలల క్రితం ఒక పార్టీలో సల్మాన్ ఖాన్‌ను కలిశానని ఇషా పేర్కొంది. ఆయనను కలిసిన తర్వాత ఆయన ఇంటికి రమ్మన్నారనే.. అందుకే వచ్చానని వెల్లడించింది.
అయితే, సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇషా వాదనలను తీవ్రంగా ఖండించారు. ఆమెకు ముందస్తు పరిచయం లేదా ఆహ్వానం లేదని ఆమె వాదనను తోసిపుచ్చారు. విచారణ సమయంలో ఆ మహిళ తాను మోడల్ అని చెప్పుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన మరోసారి సల్మాన్ ఖాన్ నివాసంలోని భద్రతా లోపాలకు నిదర్శనంగా నిలిచింది.