ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించింది. అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ ధర ఉండేలా చర్యలు తీసుకోనుందిం. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించి టిక్కెట్ల విక్రయాన్ని చేపట్టనుంది. అయితే, టిక్కెట్ల ధర తగ్గింపు వ్యవహారంపై 'ఆర్‌ఆర్‌ఆర్' నిర్మాత డీవీవీ దానయ్య, చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఈ వ్యవహారాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు.
ధరల తగ్గింపు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. దీంతో ఆ చిత్ర బృందం త్వరలో కోర్టు మెట్లు ఎక్కనుందంటూ గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా డీవీవీ దానయ్య స్పందించారు.
'ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ మేము లేదా 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి మా పరిస్థితిని తెలియజేసి సరైన పరిష్కారం కోరుతాం" అని దానయ్య ట్వీట్ చేశారు.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్, ఎమోషనల్ డ్రామా 'ఆర్‌ఆర్‌ఆర్'. రామ్‌చరణ్ - తారక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటుంది.
జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. కీరవాణి స్వరాలు అందిస్తుండగా, ఆలియాభట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ తదితరుల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.