భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో ధృవతారను కోల్పోయింది. బాలీవుడ్ దిగ్గజంగా పేరొందిన రిషి కపూర్ గురువారం ఉదయం ముంబైలో కన్నుమూశారు. కేన్సర్‌తో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన 67 యేళ్ల ఈ నటుడు.. రెండున్నర దశాబ్దాలపాటు రొమాంటిక్ హీరోగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా, అమ్మాయిల మనసు దోచుకున్న హీరోగా చెరగని ముద్రవేశారు. హీరోగా నటించడం మానేసిన తర్వాత క్యారెక్టర్ పాత్రల్లోనూ నటించి, పేరు గడించారు.
రిషి కపూర్ సుధీర్గమైన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన, లవ్లీ సాంగ్స్ ఉన్నాయి. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి స్టెప్పులేశారు. బాలీవుడ్‌లో రిషీకి ప్రత్యేక చరిత్ర ఉంది. చాక్లెట్‌బాయ్‌గా నిక్ నేమ్ కలిగిన రిషి కపూర్ సుమారు 45 మంది హీరోయిన్లతో కలిసి స్టెప్పులేశారు.
యాక్షన్ హీరోలతో పోటీగా రిషీ తన రొమాంటిక్ పాత్రలతో ఫిల్మ్ లవర్స్‌ను ఇంప్రెస్ చేశాడు. తన కెరీర్‌లో టాప్‌గా వెళ్తున్న సమయంలో అప్పుడు ఉన్న ప్రతి ఒక్క మేటి యాక్టర్‌తో అతను నటించాడు. తన కన్నా సీనియర్లతోనూ కలిసి అతను పాత్రలు పోషించాడు.
70 నుంచి 90 దశకం వరకు ఉన్న టాప్ హీరోయిన్లతో కూడా రిషీ నటించాడు. షబానా అజ్మీ, హేమా, రాఖీ, రేఖా, జయప్రద, మాధురీ దీక్షిత్, శ్రీదేవి, టీనా మునిమ్, రవీనా టండన్ లాంటి సీనియర్లతో పాటు దివ్యభారతి లాంటి యువ నటితోనూ రిషీ మూవీలు చేశాడు.
వీరందరితోనూ అతను రొమాంటిక్ పాత్రలు పోషించాడు. ఇక అరంగేట్రం చేసిన అనేక మంది హీరోయిన్లతోనూ అతను నటించాడు. డింపుల్ కపాడియా, రంజీతా, పద్మిని కొల్హాపూర్, షోమా ఆనంద్ వంటి డెబ్యూ హీరోయిన్లతోనూ రిషీ నటించాడు.