వేడుకలా.. రారండోయ్! అక్కినేని ఫ్యామిలీలో ఉన్నట్లే తెరపై నిండుగా కనిపిస్తాయ్.. (రివ్యూ)
హీరో నాగ చైతన్య 'మనం'కు ముందు తర్వాత అంత జోవియల్ పాత్ర చేయలేదు. సరిగ్గా అటువంటి పాత్రే 'రారండోయ్ వేడుక చూద్దాం'లో తను చేసినట్లు వెల్లడించారు. దర్శకుడిగా 'సోగ్గాడే.. చిన్ని నాయనా' చిత్రం విజయం తర్వాత
నటీనటులు: నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్, సంపత్‌రాజ్, జగపతిబాబు, అన్నపూర్ణమ్మ, చలపతిరావు, ఖుషీద్, తాగుబోతు రమేష్, పోసాని, వెన్నెల కిశోర్, సప్తగిరి తదితరులు.
సాంకేతిక సిబ్బంది: సంగీతం: దేవీశ్రీప్రసాద్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నందు, కెమెరా: విశ్వేశ్వర్, కథ: సత్యానంద్, నిర్మాత: నాగార్జున, కథనం, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.
హీరో నాగ చైతన్య 'మనం'కు ముందు తర్వాత అంత జోవియల్ పాత్ర చేయలేదు. సరిగ్గా అటువంటి పాత్రే 'రారండోయ్ వేడుక చూద్దాం'లో తను చేసినట్లు వెల్లడించారు. దర్శకుడిగా 'సోగ్గాడే.. చిన్ని నాయనా' చిత్రం విజయం తర్వాత కళ్యాణకృష్ణ చేస్తున్న ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ముందు రెండు చిత్రాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అన్నపూర్ణ బేనర్‌లో నిర్మించడం వల్ల కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన ఈ బేనర్‌లో టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య పెళ్లికి ముందు వస్తున్న ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ:
ఒకే ఊరిలో ఉండే జగపతిబాబు, సంపత్‌రాజ్, ఖుషీద్ స్నేహితులు. అంతా మగాళ్లేవున్న సంతప్‌రాజ్‌కు కుటుంబంలో జగదాంబ (రకుల్) పుట్టడంతో గారాభంగా పెంచుతారు. మంచితనం, పెంకితనం, పిచ్చితనం కలగలిపిన ఆమెను తొలిసారిగా ఫ్రెండ్ వివాహానికై వచ్చిన శివ (నాగ చైతన్య) చూసి ప్రేమించేస్తాడు. అయితే చిన్నతనంలోనే బామ్మ చెప్పిన ఆకాశం నుంచి వచ్చే రాజకుమారుడే తనకు జోడీ అని నిర్ణయానికి వచ్చేస్తుంది. ప్రేమంటే ఏమిటో కూడా తెలీని ఆమెకు, ఆమె ఆనందంగా ఉండాలనే చదవుకుకోసం వైజాగ్ వచ్చిన ఆమెతో సరదాగా వుంటాడు. స్నేహం మరింత బలంగా ఉందనుకునే సమయంలో తన తండ్రి తీసుకువచ్చిన రాజకుమారుడినే పెల్లిచేసుకుంటానని ట్విస్ట్ ఇస్తుంది. నువ్వు రాకుమాడివికాదు. సామాన్యుడవని.. తిరస్కరిస్తుంది. దీంతో తట్టుకోలేక.. తను ఆమెను ఎలా ప్రేమిస్తుందో కక్కేస్తాడు. ఇద్దరూ ఎవరింటికివారు వెళ్ళిపోయినా.. ఒకరి జ్ఞాపకాలు ఒకరిని వెంటాడుతూనే వుంటాయి. ఆ సమయంలో భ్రమరాంబ మనసు మార్చుకుని శివ గురించి నాన్నకు చెబుతుంది. శత్రువు కొడుకుతో పెళ్లి చేయనని తేల్చిచెబుతాడు. మరి స్నేహితుడు శత్రువు ఎలా అయ్యాడు? ఆ తర్వాత ఏమయింది? అనేది కథ.
పెర్‌ఫార్మెన్స్:
నటనాపరంగా నాగచైతన్య గత చిత్రాలతో పోలిస్తే చలాకీగా కనిపిస్తాడు. పాత్రపరంగా ఎంటర్‌టైన్ చేశాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో బాగా నటించాడు. ఇక భ్రమరాంబ పాత్ర చిత్రానికి కీలకం. అమాకత్వంతోపాటు మంచితనం కూడా ఉట్టిపడే పాత్రను అలవోకగా పోషించింది. జగపతిబాబు బాధ్యతగల తండ్రిగా, కూతురుపై అంతే బాధ్యతగా సంపత్‌రాజ్ పాత్రలు బాగున్నాయి. భార్యకు భయపడే భర్తగా వెన్నెల కిశోర్ ఎంటర్‌టైన్ చేస్తాడు. పోసాని, తాగుబోతు రమేష్‌లు తాగుబోతు తండ్రీకొడుకుల నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన పాత్రలు ఓకే.
సాంకేతికత:
సంగీతపరంగా దేవీశ్రీ ప్రసాద్ మంచి బాణీలే ఇచ్చాడు. సాహిత్యపరంగా అన్ని తెలుగుపదాలతో చక్కగా వినిపించేట్లుగా ఉన్నాయి. 'రారండోయ్..' పాట చాలా బాగుంది. కెమెరాపనితం కళ్ళకు ఇంపుగా వుంది. భారీతారగణం కావడంతో ఎడిటర్ గౌతంరాజుకు పెద్ద పనేపడింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. యాక్షన్ సీన్లు సింపుల్‌గా వున్నాయి.
విశ్లేషణ:
టైటిల్‌ను బట్టే.. రెండు కుటుంబాల మధ్య వేడుక జరిగితే ఎలా వుంటుందనేది తెలిసిపోతుంది. అయితే అక్టోబర్‌లో నాగచైతన్య, సమంత వివాహం జరగబోవడానికి ముందుగా ఇటువంటి సినిమా చేయడం లాజిక్కుగా బాగుంది. అయితే ఇటువంటి ఉమ్మడి కుటుంబాల కథలు చాలానే వచ్చినా.. ఏదో కొత్తదనం చూపిస్తేనే అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఆ ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలం అయినా.. ఇంకాస్త కథలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. బ్రహ్మాత్సం, శతమానంభవతి.. అంతా రేంజ్‌లో కుటుంబమంతా కళ్ళకు కన్పిస్తుంది. అందరూ పాజిటివ్ పాత్రలే వుంటే విలన్లు ఎవరనేది మొదటి సగభాగం అయ్యేదాకా తెలీదు. ఫస్టాఫ్ చాలా సరదాగా సాగుతుంది. హీరోయిన్ కోసం హీరో పడే పాట్లు చాలాసరదాగా వుంటాయి. మధ్యమధ్యలో రఘుబాబు, సత్తెన్న, సప్తగిరి, పృథ్వీ పాత్రలు ఎంటర్‌టైన్ చేస్తాయి. తాగుబోతు తండ్రీకొడుకులుగా పోసాని, రమేష్ పాత్రల్లో ఎంటర్‌టైన్ పెద్దగా కన్పించదు.
ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి అసలు కథ చెప్పాలి. అది చెప్పడానికి క్లయిమాక్స్ వరకు ఆగాలి. తన తండ్రిని భ్రమరాంబ తండ్రి ఎందుకు శత్రువుగా అనుకుంటున్నాడనేది తెలుసుకుని అసలు నిజాన్ని ఆయనకు చెప్పే ప్రయత్నంతో కథ ముగుస్తుంది. అపోహలు, అపార్థాలే అందుకు కారణం. మరో స్నేహితుడు ఖుషీద్ చేసిన తప్పు.. జగపతిబాబుపై పడడమే కారణం. దాన్ని ఎలా సాల్వ్ చేశాడనేది కథ. ఆ పాయింట్‌ను మరింత బాగా డీల్ చేస్తే బాగుండేది. పాటలపరంగా, డాన్స్‌పరంగా పూర్తి ఎంటర్‌టైన్‌గా వుండే ఈ చిత్రం పాత చిత్రాలు ఛాయలు కన్పిస్తాయి. ఉమ్మడికుటుంబాల ఆప్యాయతలు, అనురాగాలు అక్కినేని ఫ్యామిలీలో ఉన్నట్లే తెరపై నిండుగాకన్పిస్తుంది. అంతా పాజిటివ్‌తో వుంటే జీవితం వేడుకలా వుంటుందనే చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగులో మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇది ఎంతవరకు ప్రేక్షకులు తీసుకెళతారో చూడాల్సిందే.