హైదరాబాద్ నగరంలో ఉన్న సినీ స్టూడియోల్లో రామానాయుడు స్టూడియో ఒకటి. దీన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతల్లో అగ్రగణ్యుడు రామానాయుడు నిర్మించారు. మూవీ మొఘల్‌గా భారతదేశంలోని అధికారిక భాషల్లో సినిమాలను నిర్మించిన ఈయన రామానాయుడు స్టూడియో పేరుతో రెండు స్టూడియోలను కట్టారు. అందులో ఓ స్టూడియో ఫిల్మ్ నగర్‌లో ఉండగా.. మరో స్టూడియో నానక్ రామ్‌గూడలో ఉంది.
నానక్ రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కొన్ని వందల సినిమాలను రూపొందించారు. ఎన్నో సినిమాల రూపకల్పనకు ప్రాణం పోసిన ఈ నానక్‌రామ్‌గూడ రామనాయుడు స్టూడియో ఇకపై ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిర్మాత డి.సురేష్‌బాబు దాన్ని మీనాక్షి కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థకు డెవలప్‌మెంట్ కోసమ ఇచ్చేశారనే ప్రచారం సాగుతోంది. దీన్ని ప్లాట్స్‌గా రూపొందించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని టాక్. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.