మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వచ్చే సెప్టెంబరులో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ నెలకొంది. మఖ్యంగా, నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్యానెల్ నుంచి పోటీపడుతున్నారు. అయితే, ఆయన నాన్ లోకల్ అంటూ కొందరు వ్యాఖ్యానించారు.
దీనిపై తనను లోకల్.. నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని, కళాకారులందరూ లోకల్ కాదని యూనివర్సల్ అని ప్రకాశ్ రాజ్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్‌లో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీలో ప్రకాశ్‌రాజ్ నిలిచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
కర్ణాటక నుంచి ఏపీ వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అయితే, మరి గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏమవుతారని ఆయన ప్రశ్నించారు. అలాగే, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్‌బాబు స్థానికుడేనా? అని ఆయన నిలదీశారు.
అలాగే, మహారాష్ట్ర నుంచి చాలా ప్రాంతాలకు వెళ్లిన రజనీకాంత్, యూపీ నుంచి మహారాష్ట్ర వెళ్లిన అమితాబ్ బచ్చన్ లోకలా? అని ప్రశ్నించారు. ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ప్రకాశ్ రాజ్ తెలుగు కూడా నేర్చుకున్నారని ఆయన చెప్పారు.
అంతేగాక, చలం పుస్తకాలను ముద్రించి, తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు. అక్కడున్న ఎంతోమంది మహిళలకు పని కల్పిస్తున్నారని అన్నారు. ప్రకాశ్ రాజ్ ప్రతిభను గుర్తించి మన దేశం నాలుగుసార్లు జాతీయ అవార్డుతో సత్కరించిందని, ఆయనను ఇప్పుడు నాన్‌లోకల్ అంటున్నామని అన్నారు.