దేవుడి దయవుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా : రజనీకాంత్
దేవుడి దయవుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. పైగా, ఈనెల 31వ తేదీన తన రాజకీయరంగ ప్రవేశంపై ఓ ప్రకటన చేయనున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు.
దేవుడి దయవుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. పైగా, ఈనెల 31వ తేదీన తన రాజకీయరంగ ప్రవేశంపై ఓ ప్రకటన చేయనున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. మంగళవారం నుంచి ఆయన అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరువరకు కొనసాగే ఈ సమావేశాల చివరి రోజున ఆయన పార్టీని ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయాలు కొత్త కాదన్నారు. 1996 నుంచి రాజకీయాలను చూస్తూనే ఉన్నానని... ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి యుద్ధంలోకి దిగితే... గెలిచి తీరాలంటూ తన అభిమానులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 31న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానంటూ స్పష్టం చేశారు. దేవుడి దయవుంటే రాజకీయాల్లోకి వస్తానని అభిమానులను సందిగ్ధంలో పడేశారు.
అంతేకాకుండా, సూపర్‌స్టార్ కావాలనే ఉద్దేశంతో తాను సినిమాల్లోకి రాలేదన్నారు. 'నేను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. నేను హీరో కావడం నాకే ఆశ్చర్యం కలిగించింది. మొదట్లో హీరోగా చేయడానికి భయపడ్డా. ఎందుకు హీరోగా చేస్తున్నావని కొందరు భయపెట్టారు. మొదటి సినిమా హిట్టయ్యాక వారే వచ్చి అభినందించారు. హీరోగా నా తొలి సంపాదన రూ.50 వేలు. మొదట్లో నేను నటించేదే నటన అనుకున్నా. నా నటనను ప్రేక్షకులు కూడా అంగీకరించారు. దర్శకుడు మహేంద్రన్ నాకు నటనలో మెళకువలు నేర్పారు. నన్ను నటనలో మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహేంద్రన్' అని రజినీ కొనియాడారు.