తనకు అన్నీ ఉన్నప్పటికీ మనశ్సాంతి లేకుండా పోయిందని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తనకు ఐశ్వర్యం, అంతస్తు, పేరు, ప్రఖ్యాతలు ఇలా అన్నీ వున్నాయని కానీ మనశ్సాంతి లేకుండా పోయిందని ఆయన అన్నారు.
హిమాలయాలను చాలామంది మామూలు మంచు కొండలు అనుకుంటారని, కానీ అవి అద్భుతమైన వనమూలికలకు నెలవు అని వెల్లడించారు. అక్కడ లభించే కొన్ని మూలికలను తింటే వారం రోజులకు సరిపడా శక్తి లభిస్తుందని తెలిపారు.
మానవ జీవితంలో ఆరోగ్యానిదే ప్రముఖ స్థానం అని రజనీకాంత్ స్పష్టం చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనవాళ్లు సంతోషంగా ఉంటారని, మనం అనారోగ్యంతో ఉంటే మనకు కావాల్సిన వాళ్లు ఆనందంగా ఉండలేరని వివరించారు.
డబ్బు, పేరు, ప్రతిష్ఠలు తనకు కొత్త కాదని, తాను ఎంతో సంపాదించానని అన్నారు. అవన్నీ అశాశ్వతం అని తాత్విక ధోరణిలో వ్యాఖ్యానించారు. సిద్ధులు, యోగుల్లో ఉండే ప్రశాంతతలో తన వద్ద 10 శాతం ప్రశాంతత కూడా లేదని పేర్కొన్నారు.