కె. మురారి గా ప్రసిద్ధిచెందిన కాట్రగడ్డ మురారి తెలుగు సినిమా నిర్మాత. సినిమాలపై ఆసక్తితో వైద్య విద్య మధ్యలో ఆపేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. సీతామాలక్ష్మి, గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామ కల్యాణం, శ్రీనివాస కళ్యాణం, జానకిరాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి భిన్నమైన సినిమాలు నిర్మించారు. ఈరోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
విజయవాడ, మొగల్రాజపురంలో 1944, జూన్ 14న జన్మించారు. ఆయన తండ్రి భవానీ ప్రసాద్ జమిందార్. విజయవాడలో చాలా భాగం వారి ఆధీనంలోనే వుండేవి. తాత, నాయనమ్మలు: కాట్రగడ్డ గంగయ్య, అక్కమ్మలు. వరంగల్లు. హైదరాబాదులలో యంబీబీయస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు చేసి సినిమా రంగంలో ప్రవేశించాడు. సినిమారంగంపై అవగాహన కలిగేందుకు వి. మధుసూదనరావు దగ్గర సహాయ దర్శకుడిగా పలు సినిమాలకు పనిచేశారు. ఎ. కోదండరామిరెడ్డికూడా సహాయదర్శకుడే. ఆయన దర్శకుడుగా మారితే మురారి నిర్మాతగా మారాడు.
వారివద్దే విలువలు నేర్చుకున్నారు
వి.మధుసూదనరావుతోపాటు జెమినీ వాసన్ సినిమాలకూ మురారి పనిచేశారు. ఎన్.టి.ఆర్.తో జెమినీ వాసన్ సినిమా రూపొందిస్తున్నారు. పావుభాగం షూటింగ్ పూర్తయింది. ఇక ఆ సినిమాను నవయుగ పంపిణీదారులకు ఇవ్వాలని వాసన్ నిర్ణయించుకున్నారు. అది తెలిసిన ఎన్.టి.ఆర్., నవయుగ వారికి వద్దని పట్టుబట్టారు. అప్పుడు వాసన్ సమాధానం నిర్మాత విలువ ఏమిటో తెలిసింది మురారికి. ఎన్.టి.ఆర్.గారు మీరు హీరో. మీ బాధ్యత నటించడం వరకే. పంపిణీ అనేది మాకు సంబంధించింది. మీ జోక్యం వద్దు. మీరు మరీ పట్టుబడితే ఇప్పటివరకు తీసిన సినిమాను వదిలేస్తాను అంటూ గట్టిగా సమాధానమిచ్చారు. దాంతో ఖంగుతిన్న ఎన్.టి.ఆర్. ఏమీచేయలేకపోయారు. ఆ తర్వాత సినిమా పూర్తి చేశారు. ఇలాంటి సంఘటనలు చక్రపాణిగారి నుంచి కూడా మురారి నేర్చుకున్నారు.
అన్ని తెలియాలి అనేవారు
నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టేవాడు కాదు. కథ, సంగీతం, నటీనటుల ఎంపిక, ఎంత ప్రొడక్షన్ అవుతుందో, బిజినెస్ వ్యవహారాలు అన్నీ తెలుసుండాలనేవారు. కె.విశ్వనాథ్‌తో ఆయన సీతామాలక్ష్మి సినిమా నిర్మించారు. కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. విశ్వనాథ్‌గారు ఓ ట్యూన్‌కు ఓకే చేశారు. కానీ మురారి ఆ ట్యూన్ బాగోలేదని మరో ట్యూన్ తీసుకునేవారు. ఇలా కథ, కథనం విషయాలో మురారి కలుగుజేసుకునేవారు. ఈ విషయాలు విశ్వనాత్‌కు నచ్చేదికాదు. ఇక ఆ సినిమా ముగింపులో ట్రాజడీ వుండాలని విశ్వనాథ్ చేశారు. కానీ హ్యాపీ ముగింపు వుండాలని మురారి పట్టుబటి రెండు రకాలుగా షూట్ చేశారు. ఫైనల్ మురారి చెప్పినట్లే సినిమా విడుదల చేశారు. అది అద్భుత విజయాన్ని చవిచూసింది.
యువచిత్ర బేనర్
యువచిత్ర బేనర్ స్థాపించి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆయనతోపాటు ఆయన అన్నగారు నాయుడుగారు భాగస్వామి. ఇక మధుసూధనరావుకు కోపం ఎక్కువ. వాటిని భరిస్తూ ఆయన దగ్గర మురారి సహాయకుడిగా పనిచేశారు. అదే కోపం ఈయనకూ వుందని ఆ తర్వాత పలువురు అంటుండేవారు. అందుకే ఆయన ఎక్కువకాలం నిర్మాతగా ఇమడలేకపోయారు. దానికి కారణం ఏమిటని అడిగితే, నిర్మాత అనేవాడికి ఇప్పుడు విలువలేదు. కేవలం డబ్బు పెట్టేవాడుకానే చూస్తున్నారు. కథ, నటీనటుల ఎంపిక అనేది నిర్మాతకు తెలీయకుండా జరిగిపోతున్నాయి. సెట్‌కెళితే నిర్మాత ఎందుకు వచ్చారనే గుసగసలాడుకుంటారు. దీనితో ఇప్పుడు మనం సినిమాలు నిర్మించలేమని ఆయన చెప్పారు.
ఆత్మకథ రాశారు
ఆయన 2012లోనే సినిమారంగంలోని పోకడలు, తనకు ఎదురైన అనుభవాలతోపాటు తన స్వంత ఇంటి విషయాలు, చిన్నప్పుడు విజయవాడలో వుండగానే తన తండ్రి ఏవిధంగా బిహేవ్ చేసేవారో అందరికీ తెలియాలని తనలోని రచయితకు పని పెట్టారు. ఆత్మకథ అంటూ `నవ్విపోదురు గాక` అనే పుస్తకం విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. రాఘవేంద్రరావు సంస్కారహీనుడు గౌరవంలేనివాడు. అలాంటి ఆయనకు గీతం యూనివర్సిటీ డాక్టరేట్ ఎలా ఇచ్చిందంటూ ప్రశ్నించారు. గతంలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాఘవేంద్రరావు ఎగ్గొట్టారని తెలిపారు.
ఇలా పలువురిపై తన అభిప్రాయాలను తెలియజేయడంతోపాటు తన కుటుంబంలోని పోకడలపైనా బాణాలు ఎక్కుపెట్టారు. తన తండ్రి వ్యసరపరుడని ఉదాహరణలతోసహా వివరించారు. ఆఖరికి నిర్మాతగా దూరంగా కావడానికి ఇప్పటి తరం నిర్మాతకు గౌరవం ఇవ్వకపోగా జోకర్‌లా చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఎన్నో విషయాలను తెలియజేయడంవల్ల `నవ్విపోదురు గాక` నాకేంటి అనేలా పేరు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోనే హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.