మెగాస్టార్ చిరంజీవి. రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఆచార్య. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను నిర్మాతలు ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందరి అంచనాలకు తగినట్లే ఆచార్య సినిమా ఉంటుంది అన్నారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్, సురేశ్ సెల్వరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.