ఓవియా అంటే పిచ్చి ప్రేమలో ఉన్న అభిమానులకు '90 ఎంఎల్' చిత్రం చెడు అనుభవాన్ని గుర్తుచేస్తుంది. సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అంటూ నటి ఓవియ చిత్రంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ తెరకెక్కించారు. శుక్రవారం నాడు అంటే మార్చి 1వ తేదీన 90 ఎంఎల్ చిత్రం విదులైంది.
ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్క అభిమాని నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఇందులో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్ చుంబనాలు, సహజీవనం వంటి సన్నివేశాలు చోటుచేసుకోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. '90 ఎంఎల్' చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రమిది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
అంతేకాదు.. డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయాకూడదని అన్నారు. ఈయన వ్యాఖ్యలకు 90 ఎంఎల్ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్ బదులిస్తూ.. మీరు నిర్మించిన చంద్రమౌళి సినిమాలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకురాలిని కాదు.. అని వెటకారపు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
అప్పుడు ధనుంజయన్ నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదన్నారు. ఎలా ఉండాలన్నిది దర్శకుడి నిర్ణయం అని.. నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. దీంతో అనితా ఉదీప్... సార్ మీతో వివాదం బోర్ కొడుతోంది.. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అంటూ పేర్కొన్నారు.
తరువాత ధనంజయన్ నుండి బదులు రాకపోవడంతో.. అనితా ప్లీజ్ పారిపోకండి.. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది.. అంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరి వివాదం ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.