పాడుతా తీయగా కార్యక్రమంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు నేపధ్యంలో గాయని సునీత ఓ వీడియో విడుదల చేసారు. అందులో ఆమె మాట్లాడుతూ... '' రకరకాల ఛానళ్లలో రకరకాల వార్తలు వచ్చాయి. ప్రవస్తి ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నించింది. డైరెక్టుగా సునీత అని మాట్లాడింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అందరిలాగే ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దుగా పాడారు అని చెప్పేవాళ్లం. ఎవరు బాగా పాడితే ఆ పాట మాధుర్యంలో కరిగిపోయేవాళ్లం.
మా గురించి చర్చించే స్థాయికి వెళ్లావంటే అసంతృప్తిగా వుంది. సింగర్ పాటల సెలక్షన్ విషయంలో ఆయా ఛానళ్లకు రిస్ట్రెక్షన్స్ వుంటాయి. అన్ని పాటలకు అనుమతి వుండదు. పాల్గొనేవారు పాడదల్చుకున్న పాటలకు అనుమతి లేకపోతే పార్టిసిపెంట్స్‌కు నచ్చచెబుతారు. మేము ఎవరికీ వ్యతిరేకంగా వుండము, ఎవరి జీవితాలో నాశనం అయితే చూడాలని కోరుకోము.
కన్నీళ్లు, బాధ ఇవన్నీ అనుభవించి కిందిస్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. ప్రతిభ వున్నవారిని ఇండస్ట్రీలో ఎవరూ ఆపలేరు. దీనికి సంబంధించి ఎందరో జీవితచరిత్రలు వున్నాయి. పోటీ అంటే గెలుపు ఓటమి రెండూ వుంటాయి. రెండింటినీ హుందాగా తీసుకుని ముందుకు సాగాలి'' అంటూ అన్ని విషయాలను కూలంకషంగా చెప్పారు.