శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ముద్దుగా అందరూ బాలు అని పిలుచుకునే జ్ఞాని 75వ జయంతి జూన్ 4. అందుకే ఒకసారి ఆయన పాటల్లో అమృతత్వాన్ని తెలుసుకుందాం. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. డబ్బింగ్ కళాకారుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి పలు భాషల్లో సుమారు 50 వేల పాటలు పాడారు.
బాలుగారు ఏ పాట పాడకుండా వదిలేశారని ఎంత వెతికినా తెలియదు. ఎందుకంటే అన్ని తరహా పాటలు పాడేశారు. పాట సామ్రాజ్యంలో మకుటంలేని మారాజు. 15 భాషల్లో ఆయన అలవోకగా పాడేవారు. 1966 డిసెంబర్ 15న `శ్రీమర్యాద రామన్న` సినిమాకు `ఏమి ఇంత మోహం జవరసాల..` పాటను ఈలపాట రఘురామయ్య, పి.సుశీలతోపాటు కలిపి ఆలపించారు. ఇక చంద్రమోహన్ నటించిన సినిమాకు `మేడంటే మేడకాదు. గూడంటే గూడుకాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది` అంటూ పాత్రకు వన్నె తెచ్చారు. 1980లో ఆయన పాడిన ఓ పాట ఏ ఊరి కచేరీలోనైనా ఈ పాట తప్పనిసరి. ఇక కాలేజీ, హైస్కూల్ పాటల పోటీల్లో కూడా ఈ పాట పాడితే దానికి ప్రైజ్ వచ్చేది. ఆ పాట ఇదే, `ఏ దివిలో విరిసిన పారితాజమో ఏ కవిలో విరిసన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయినే..` పాట బాలు గాత్రంతో వన్నె తెచ్చింది.
అలా అలలు అలలుగా సముద్రంలోనుంచి వచ్చినట్లుగా ఒక్కో పాట ఆయన గాత్రంనుంచి జారేవి. ఆయన విదూషీమణి. మిమిక్రీ ఆర్టిస్టుకూడా. అందుకే తన గాత్రంతో కొత్త ప్రయోగాలు చేసేవారు. రాజబాబులా గొంతు మార్చి `ముత్యాలు వస్తావా..` అన్నా, చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అని మాడా నుంచి పాట వచ్చినా ఆయన గాత్ర మహిమే. తన మిమిక్రీ కళతో కమల్ హాసన్ దశావతారం సినిమాకు ఏడు పాత్రకు ఆయనే గాత్రం ఇచ్చారు. బాలు గొంతులేకపోతే కమల్ నటన ఊహించలేం అన్నట్లుగా వుండేది.
బాలు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన గాత్రంతో చవులూరించేవారు. భాషా బేధం లేకుండా సంగీతంలో చెరగని ముద్రవేశారు. ఒకే రోజులో 23 పాటలు, 6 గంటల్లో 16 పాటలు పాడడం ఆయనకే సాధ్యం. ఇక నటనావైదుష్యంతో ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాతో తన భారీకాయంతో నృత్యం చేశారు. తండ్రిగా నటించి మెప్పించాడు. 80లో తమిళంలో తేలని కన్మణిలో హీరోగా నటించారు. తనికెళ్ళ భరణి `మిధునం`లో ఆయన నటన తెలిసిందే. జీవిత సారాన్ని అద్భుతంగా పండించారు. కమల్‌హాసన్‌కు ఆయన గొంతు పెద్ద ఎస్సెట్. ఇక అటెన్‌బరో తీసిన గాంధీ పాత్రకు బాలునే డబ్బింగ్ చెప్పారు.
ఎన్నో మెలోడీ పాటలు ఆలపించిన ఆయన `మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.` అంటూ ఊసులు పలికించేవారు. అదేవిధంగా `శంకరాభరణం` సినిమాలో కనిపించే నటుడు జె.వి. సోమయాజులు అయితే వినిపించే హీరో బాలునే. ఆయనకు ఆ పాట జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది. `సాగరసంగమం`లో `వేదం అనువనునా..`, `భైరవద్వీపం`లో `శ్రీ తంబుర నాదనునాదం..` గీతాలు వేటికవే ప్రత్యేకతలు. ఆయన చనిపోవడానికి ముందే అంటే 2020 జనవరిలో రవితేజ నటించిన `డిస్కోరాజా` సినిమాలో `నువ్వు నాతో ఏమన్నావో, నేనేం విన్నానో.. అనే పాటలో మెళుకువలు ఇప్పటి జనరేషన్ ను కూడా ఆకట్టుకొనేలా `థింగిడిపప్పా జిగిడిజిగిడి పప్పా,` అంటూ తన గాత్ర మహిమతో కొత్త ప్రయోగాన్ని చేస్తూ సంగీతానికి అనుగుణంగా పలికారు. ఇలా బాలీవుడ్‌లో కిశోర్‌కుమార్ తర్వాత అంతటి ఘనత బాలుకే దక్కింది.
అందుకే ఆయనకకు అవార్డులు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. 2001లో పద్మ అవార్డు, 2011లో పద్మభూషణ్‌తోపాటు దాదాపు 150 అవార్డులు ఆయన చెంతన చేరాయి. అందుకే ఉప్పొంగే గోదారి కాసేపు కనుమరుగయినట్లు `ఆమని కోయిల పాడే మూగవై పోకు ఏ వేళా..` అంటూ ఆయన గాత్రం నుంచి వచ్చిన పాటలాగే ఆయన మనల్ని మూగవానిగా చేసి కరోనా సమయంలోనే సెప్టెంబర్ 2020లో దివికేగారు. ఇవే ఆయనకు అశృనివాళులు..