తెరాస మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తెరాస నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచి చూపించానని అన్నారు. 'అయితే, ఆయన తన సొంత కుమార్తెకు బీ-ఫారం ఇచ్చినా ఓడిపోయింది. నేను మాత్రం ఓడిపోలేదు. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచి వచ్చాను. తెలంగాణ కోసం పార్టీ ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ఆదేశించినా నేను రాజీనామా చేశాను' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
'తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవలం ఏడుగురే. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. కనీసం 10 సీట్లు కూడా గెలవలేదన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు' అని ఈటల రాజేందర్ తెలిపారు.
'ముఖ్యమంత్రిని కలవడానికి నేను గతంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి వెళితే గేటు వద్దే మమ్మల్ని ఆపేశారు. ఈ విషయం మీడియాకు తెలిస్తే మా పరువు పోతుందని వారికి చెప్పాం. రెండోసారి అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లాము. అప్పుడు కూడా గేటు వద్ద నుంచే వెనుదిరిగాము. బానిస కంటే నీచంగా మంత్రి పదవి ఉంది. ఎంపీ సంతోష్ కుమార్‌తో నేను అప్పట్లో చెప్పాను. దీనికి ప్రగతి భవన్ అని కాకుండా బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని అన్నాను' అని ఈటల రాజేందర్ తెలిపారు.
ఇకపోతే, తెరాస పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్‌రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిసంఘం నేను పెట్టిస్తే దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు కవిత నడుపుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నేను, హరీష్ రావు పెట్టిస్తే.. కవితకు అప్పగిస్తున్నారు. ఏ సంఘానికీ ఈ రోజు హక్కులు లేవు. ధర్నా చౌక్ కూడా లేదు.
ఇవి మేము అడుగొద్దా? పెన్షన్‌లు సీఎంకు చెప్పి ఇప్పిస్తా అని చెప్పడం తప్పా? ఐకేపీ సెంటర్లు ఉంటాయ్.. ధాన్యం కొంటాయ్ అని చెప్పడం తప్పా? రోషం గల బిడ్డను కాబట్టే ఆనాడు తెరాసలో చేరినా. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యమా? నీవు లల్లు, మాయావతిలాగా పెట్టిన పార్టీ కాదు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. అందర్ వాలే బాహర్, బాహర్ వాలే అందర్ అన్నట్లుగా ఉంది అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
'నిన్ను చంపుతా అన్న వారు వచ్చి మీ పక్కన కూర్చున్నారు. నాకు మస్క కొడితే పదవి ఇవ్వలేదు. ఆలె నరేంద్ర, విజయశాంతిని నాలానే పంపించారు. మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు. నక్సలైట్ అజెండా అని చెప్పిన మీరు వరవరరావును జైల్‌లో పెడితే ఎందుకు మాట్లాడలేదు? మంత్రుల మీదే నమ్మకం లేకపోతే నాలుగు కోట్ల ప్రజలను అడిగే హక్కు ఎక్కడిది? అప్పటి ఒక దళిత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఆయనది.. సహాయం అడిగితే చేయొద్దని ఆదేశించారు. ఆ దళిత మాజీ ఎమ్మెల్యే ఎవరో కూడా ఎప్పుడు చెప్పమన్నా చెప్పేందుకు నేను సిద్ధం అని ఈటల వ్యాఖ్యానించారు.