తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మాతృపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితో పూర్తిగా తెగదెంపులు చేసుకోనున్నారు. ఇందులో భాగంగా, ఆయన శుక్రవారం తన శాసన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. తన నివాసంలో నిర్వహించే మీడియా సమావేశంలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్, మరికొందరు ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కొవిడ్ దృష్ట్యా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లే అవకాశం లేదు.
ఈటల, మరికొందరు ముఖ్యులు చేరిన తర్వాత.. మిగతా వారు కాషాయ కండువా వేసుకోనున్నారు. గత నెల 30న ఢిల్లీ వెళ్లిన ఈటల, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన సంగతి తెలిసిందే. ఆయనతో సమావేశం అనంతరం, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, సంజయ్‌తో ఈటల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చేరిక తేదీపై చర్చించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. 9, 10, 11 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా సంజయ్ ద్వారా జాతీయ అధ్యక్షుడి అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారాం. అన్నీ సక్రమంగా కుదిరితో వచ్చే ఈవారంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు.