Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలన్ పాత్రలే కాదు.. విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా కైకాల

Advertiesment
kaikala sathyanarayana
, శుక్రవారం, 23 డిశెంబరు 2022 (09:14 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఎస్వీ రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీరమైన పాత్రలు ఎక్కువగా సత్యనారాయణను వరించాయి. అటు పౌరాణికం, ఇటు జానపదం, సాంఘిక చిత్రాల్లో బలమైన పాత్రలు దక్కాయి. 'గూండా', 'గ్యాంగ్' లీడర్', 'సమర సింహారెడ్డి' వంటి సినిమాల్లో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. 
 
ఎన్టీఆర్, ఏయన్నార్ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇలా ఆనాటి యువ హీరోలకు ప్రతినాయకుడు అంటే సత్యనారాయణ. రావుగోపాలరావుతో కలిసి విలన్‌గా తెరను పంచుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై రాణించారు. తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా ఇలా ఒక్కటేమిటి సత్యనారాయణ పోషించని పాత్ర అంటూ లేదు.
 
కేవలం విలన్ పాత్రలో కాదు విభిన్న పాత్రలకూ సత్యనారాయణ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. 'కనక దుర్గ పూజా మహిమ' తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినా, 1962 నుంచి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. 'స్వర్ణగౌరి'లో శివుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత 'మదన కామరాజు కథ'లో ధర్మపాలుడిగా, 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కర్ణుడిగా, 'నర్తనశాల'లో దుశ్శాసనునిగా నటించారు. 
 
విఠలాచార్య 'అగ్గి పిడుగు'లో రాజనాల ఆంతరంగికునిగా, 'జిస్ దేశ్ మే గంగా బెహతీ హై'లో ప్రాణ్ గెటప్లో కనిపించి ఆకట్టుకున్నారు. 'శ్రీకృష్ణావతారం', 'కురుక్షేత్రం'లో సుయోధనుడిగా, 'దాన వీర శూరకర్ణ'లో భీమునిగా, 'సీతా కల్యాణం'లో రావణాసురుడిగా, అసమాన నటన ప్రదర్శించారు. 
 
వరుస పాత్రలతో సత్యనారాయణ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక చిత్రాల్లో నటనతో వెండితెరపై చెరగని ముద్రవేశారు. 'ప్రేమనగర్ 'లో కేశవ వర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. 'అడవి రాముడు', 'వేటగాడు' సినిమాల్లో విభిన్నమైన విలన్ పాత్రలు పోషించి మెప్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాటకాలతో తన ప్రస్థానాన్ని ఆరంభించిన కైకాల