పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనలో బిజీగా ఉన్నప్పటికీ తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్ర యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకుగాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈరోజు నుంచి యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ చిత్రీకరణలో సుమారు 400-500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.