Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఘనంగా ప్రారంభం

Ustaad Bhagat Singh
, ఆదివారం, 11 డిశెంబరు 2022 (14:46 IST)
'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి చేతులు కలిపారు. 'గబ్బర్ సింగ్'తో నమోదైన రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టిస్తామని నమ్మకంగా ఉన్నారు. వీరి కలయికలో రానున్న రెండో చిత్రానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ బ్లాక్ బస్టర్ కలయికలో రెండో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభించబడింది.
 
పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం కారణంగా 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు మరియు పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి. వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు.
 
'ఉస్తాద్ భగత్ సింగ్‌'ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈరోజు చిత్ర ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెల్లటి ఓవర్‌కోట్‌ ధరించి, హార్లే డేవిడ్‌సన్ బైక్‌ పక్కన, టీ గ్లాస్ పట్టుకుని నిల్చొని ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో, 'ఉస్తాద్ భగత్ సింగ్' రాకను సూచించే గాలిమర, టవర్ మరియు మెరుపులను గమనించవచ్చు. అలాగే పోస్టర్ లో 'ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు', 'మనల్ని ఎవడ్రా ఆపేది' అనే క్యాప్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. గతంలో హరీష్ శంకర్ తో 'దువ్వాడ జగన్నాథం' చిత్రానికి పని చేసిన అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్'తో పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న దేవిశ్రీప్రసాద్ మంచి ఫామ్ లో ఉన్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
 
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వరుస విజయాలతో కొన్ని సంవత్సరాలలోనే తెలుగు సినీ పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. పలు భారీ చిత్రాలను నిర్మిస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. పవన్-హరీష్ కలయికలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతోనూ విజయపరంపరను కొనసాగించడానికి మైత్రి సంస్థ సిద్ధంగా ఉంది.
 
రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి
సీఈవో: చెర్రీ
 
స్క్రీన్ ప్లే: కె దశరథ్
రచనా సహకారం: సి చంద్ర మోహన్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రావిపాటి చంద్రశేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు శరత్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారు.. వదంతులు నమ్మొద్దు