కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓ ప్రముఖ నటిని ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ సీన్ మారింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేది లేదని మొండికేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఎక్కడకు వెళ్లకుండా అంబులెన్స్ చుట్టుముట్టారు. చివరకు నటి అభ్యర్థన మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్, ఆదిత్య వర్మ చిత్రాల్లో నటించిన బనితా సంధు డిసెంబర్ 20న లండన్ నుంచి భారత్‌కి తిరిగి వచ్చారు. ఆమెతో ప్రయాణించిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ కరోనా వైరస్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఆమెకు కూడా పరీక్షలు నిర్వహించారు. అందులో బనితాకు పాజిటివ్‌గా తేలింది. ఇక లండన్ నుంచి వస్తోన్న వారిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని కోల్‌కతాలోని బెలియాఘాట ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. బబితాను కూడా అక్కడికే పంపారు.
అయితే అక్కడ ఆసుపత్రి మెయిన్‌టెన్స్ సరిగా లేదని, అందులో చేరనని బబితా మొండికేసింది. దీంతో అక్కడి వారు రాష్ట్ర సెక్రటేరియట్, హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక ఈ తతంగం మధ్యలో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కూడా ఆమె సిద్ధమైంది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అక్కడకు చేరుకొని ఆమె అంబులెన్స్ నుంచి బయటకు రాకుండా చూశారు. ఇక రాష్ట్ర సెక్రటేరియట్ అనుమతితో ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె దగ్గర నుంచి ఓ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.