బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఏకంగా 250 కోట్ల రూపాయల మేరకు అప్పు ఉండటం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
నిజానికి నితిన్ దేశాయ్‌కు బీ టౌన్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మంచి గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పలు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో ప్రచురితమైన కథనాల ప్రకారం అప్పుల భారం తట్టుకోలేకనే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
సదరు కథనాల ప్రకారం.. సీఎఫ్‌ఎం అనే ఫైనాన్స్ సంస్థ నుంచి 2016, 2018 సంవత్సరాల్లో రెండు దపాలుగా రూ.180 కోట్లను నితిన్ తీసుకున్నారు. 42 ఎకరాల స్థలాన్ని, ఇతర ఆస్తులను తనఖా పెట్టి ఆయన పెద్ద మొత్తంలో అప్పు అందుకున్నారు. అయితే, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నితిన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో, సదరు ఫైనాన్స్ సంస్థ నితిన్ నుంచి డబ్బు వసూలు చేసే బాధ్యతను ఎడిల్విస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అనే సంస్థకు అప్పగించింది. ఈ క్రమంలో ఎడెల్విస్ సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు రుణ రికవరీ ప్రక్రియను అంగీకరించింది.
జులై 25న ఉత్తర్వులు కూడా వచ్చాయి. నితిన్‌కు ఇప్పటివరకూ దాదాపు రూ.252 కోట్ల అప్పు ఉన్నట్లు సమాచారం. రుణ భారం తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మరోవైపు, నితిన్ మరణంతో హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ బాలీవుడ్ సెలబ్రిటీలు వరుస ట్వీట్స్ చేస్తున్నారు.