అలా..మొదలైంది, జబర్థస్త్, కళ్యాణ వైభోగం.. చిత్రాలతో సక్సస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్న దర్శకురాలు నందినీ రెడ్డి. వైవిధ్యమైన కథా చిత్రాలను అందించిన నందినీ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ఓ..బేబి. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఓ..బేబీ కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్.
సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని పాటలకు విశేష స్పందన లభించింది. అలాగే ట్రైలర్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. జులై 5న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకురాలు నందినీ రెడ్డి చిత్ర విశేషాలను తెలియచేస్తూ...మేం బాగా కనెక్ట్ అయిన కథ ఇది. ఒక మంచి సినిమాని అందించాలని ఈ సినిమాని తీసాం. మనందరి లైఫ్‌లో మదర్ ఎమోషన్ అనేది చాలా కీలకమైంది. ఈ ఎమోషన్ ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే..కొన్ని రోజులు పాటు గుర్తుంటుంది ఈ సినిమా.
ఈ సినిమాని రీమేక్ చేయాలని సమంతే ఫస్ట్ నా దగ్గరికి ఈ సినిమాని తీసుకువచ్చింది. ఇది కొరియన్ లో వచ్చినప్పటికీ మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. అందుకనే రీమేక్ చేసాం. ఖచ్చితంగా అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక సమంత గురించి చెప్పాలంటే...తను తప్ప ఈ పాత్రను ఇంకెవరు అంత గొప్పగా చేయలేరు. నటించడమే కాకుండా.. స్క్రిప్టులో కూడా మంచి సలహాలు ఇచ్చింది.
ఇక సీనియర్ నటి లక్ష్మీ గారి గురించి చెప్పాలంటే...ఆవిడ ఈ సినిమాలో నటించను అంటే..ఈ సినిమా చేసి ఉండేవాళ్లం కాదేమో. ఆమె పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. వాటిని పండించాలంటే ఖచ్చితంగా ఆ పాత్రను గొప్ప నటి నటించాలి. లక్ష్మీ గారు తప్ప మాకు ఇంకెవరు కనిపించలేదు. నిజంగా..చాలా అద్భుతంగా నటించారు. అలాగే రాజేంద్రప్రసాద్ గారు, రావు రమేష్ గారు, తేజ...ఇలా ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు. ఖచ్చితంగా ఓ..బేబీ అందర్నీ ఆకట్టుకుంటుంది అని మా గట్టి నమ్మకం అని చెప్పారు.