సినిమా ఫ్లాప్ అవ్వడంతో యువ హీరో రైటర్‌గా మారి కథ తనే రాసుకున్నారు. ఏంటి ఇది నిజమా.. అనుకుంటున్నారా..? నిజమే. ఆ యువ హీరో ఎవరో కాదు నాగశౌర్య. అవును.. నాగశౌర్య తన సినిమాకి తనే కథ రాసుకున్నారు. నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించనున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ... ఈ నెల 13 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. వైజాగ్‌లో 70 శాతం షూటింగ్ చేయనున్నాం. కొత్త డైరెక్టర్ తేజ. యు.ఎస్ ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్లో కోర్స్ చేసాడు. రెండు సంవత్సరాల నుంచి ఫ్రెండ్ నాకు. మంచి స్టోరీ. ఖచ్చితంగా బాగా తీస్తాడని నమ్ముతున్నాను. మెహ్రీన్‌తో ఫస్ట్ టైమ్ నటిస్తున్నాను. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న మూడవ సినిమా ఇది. ఖచ్చితంగా మంచి సినిమాతో వస్తామని అనుకుంటున్నాను.
ఈ సంస్థలో నిర్మించిన రెండో సినిమా నర్తనశాతో నిరాశపరిచాను. కానీ.. ఇది అలా కాదు. ఛలో సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇక టైటిల్ విషయానికి వస్తే అశ్వద్ధామ. ఈ మూవీకి.. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సివచ్చిందంటే... ద్రౌపది గారి చీర లాగుతున్నప్పుడు అందరూ చూసి నవ్వుకున్నారు కానీ.. ఒక్కరు మాత్రం ప్రశ్నించారు. అది అశ్వద్ధామ. ఈ సినిమాలో కూడా ప్రశ్నించేవాడిని నేను. అందుకనే ఈ టైటిల్ పెట్టాం.
ఈ చిత్రానికి కథను నేనే అందిస్తున్నాను. నిజంగా జరుగలేదు. కానీ రాసాను అంతే. ఛలో సినిమాకి ఆల్మోస్ట్ రాయడం జరిగింది. నర్తనశాల కథ విషయంలో తప్పు జరిగింది. చూసుకోలేదు. సినిమా ఆడకపోవడానికి ఆడియన్స్ తప్పేం లేదు. మేమే సరిగా పట్టించుకోలేదు. నా సినిమా ఫెయిల్ అయినా ఫరవాలేదు కానీ.. ఐరా సంస్థలో ఫ్లాప్ రాకూడదు అనుకుంటున్నాను అన్నారు.
బాగానే ఉంది. తన సినిమా ఫెయిల్ అయినా ఫరవాలేదు కానీ.. తన సంస్థలో నిర్మించే సినిమా ఫ్లాప్ అవ్వకూడదట. అందుకనే రైటర్ అయ్యాడట. మరి.. ఈ హీరో గారి ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? చూద్దాం..?