Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున

1080 ఎకరాల అటవీ భూమిని దత్తత  తీసుకున్న నాగార్జున
, గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:22 IST)
Nagarjuna, MP Santosh Kumar, nagachaitanya, sushanth and others
త‌న తండ్రి పేరు మీద సేవ చేస్తాన‌ని ఇటీవల ప్రకటించినట్లుగానే ప్రముఖ నటుడు నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా,  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
 
హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కు ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.  
 
మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానాని నాగార్జున తెలిపారు. గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్ గారితో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్లు గానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.  
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్ బ్లాక్ లో దివంగత అక్కినేని నాగేశ్వర రావు పేరుపై అర్బన్ పార్కు అభివృద్దితో పాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించి ఎంపీ వెల్లడించారు.  దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందని, రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 
 
webdunia
Nagarjuna, Amala, nagachaitanya and others
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.ఏం. డోబ్రియల్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఏం.జె. అక్బర్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు,
హైదరాబాద్ డీఎఫ్ఓ జోజి,  డీఎఫ్ఓ అశోక్, అక్కినేని నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు సుప్రియ యార్లగడ్డ, సురేంద్ర యార్లగడ్డ, సుమంత్ కుమార్, సుశాంత్, నాగ సుశీల, లక్ష్మీ సాహిత్య, సరోజ, వెంకట నారాయణ రావు, జ్యోత్స్న, అనుపమ, అదిత్య, సంగీత, సాగరిక, తదితరులు పాల్గొన్నారు. 
 
హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్- మేడిపల్లి ప్రాంతంలో చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్ ఉంది. చుట్టూ విపరీతంగా జరిగిన పట్టణీకరణ మధ్య ఈ 1682 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో నాగార్జున వేయి ఎకరాలను దత్తత తీసుకున్నారు. నగర వాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేలా కొద్ది ప్రాంతంలో అర్బన్ పార్కును అభివృద్ది చేసి, మిగతా ప్రాంతంలో అటవీ పునరుద్దరణ పనులు చేయనున్నారు. మేడిపల్లి నుంచి చెంగిచర్ల, చర్లపల్లి, ఈసీఐఎల్ ప్రాంతాలు, కాలనీ వాసులకు ఈ పార్కు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. 
 
(ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఇప్పటికే మూడు ప్రాంతాల్లో అటవీ బ్లాక్ ల దత్తత జరిగింది. ప్రసుత్తం నాగార్జున తీసుకున్నది నాల్గవ బ్లాక్. మూడు ప్రాంతాల్లో ఇప్పటికే పార్కుల అభివృద్దితో పాటు, అటవీ ప్రాంతం స్థిరీకరణ, పునరుద్దరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎం.పీ సంతోష్ స్వయంగా కీసర అటవీ ప్రాంతంలో 2,042 ఎకరాలను దత్తత తీసుకుని ఎకో పార్కును అభివృద్ది చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఖాజీపల్లి అటవీ ప్రాంతంలో 1650 ఎకరాలను, ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ నర్సాపూర్ రోడ్ లో మంబాపూర్ అటవీ ప్రాంతంలో 2,543 ఎకరాలను దత్తత తీసుకుని పర్యావరణహితంగా అభివృద్ది చేస్తున్నారు.)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిభావంతులకు ఆనంద్ దేవరకొండ గం.. గం.. గణేశా టీమ్ ఆహ్వానం