సినిమాను సహజసిద్దంగా తెరకెక్కించే రోజులు పోయాయి. ఏదైనా మార్కెట్ సీన్, థియేటర్ సీన్, జనసందోహం ఉన్న రోడ్లపై సీన్లు తీయాలనుకుంటే ఒకప్పుడు అందరి మధ్య ఉండగానే తీసేవారు. కానీ నేడు ఉన్న పరిస్థితులలో అలా షూటింగ్‌లను పూర్తి చేయడం దాదాపు సాధ్యం కాదు. ఒక హీరో లేక హీరోయిన్ రోడ్డుపై కనిపిస్తే షూటింగ్ మాట అటుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అందుకే అన్నీ సెట్టింగ్‌లతో చేసేస్తున్నారు లేదంటే తెలియని ప్రాంతాలకు వెళ్లి షూటింగ్‌లు చేస్తున్నారు.
సహజంగా అనిపించే సినిమాలకు పెట్టింది పేరు అయిన శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్, లీడర్, గోదావరి, ఆనంద్ ఇలా అన్ని చిత్రాలు సహజత్వానికి అతి దగ్గరగా మన పక్కింట్లో జరిగినట్టే ఉంటాయి. అయితే చాలా రోజుల తరువాత తెలంగాణ లొకేషన్‌లో తీసిన ఫిదా చిత్రంతో మళ్లీ హిట్ కొట్టాడు శేఖర్ కమ్ముల. అయితే ఆ సినిమా వచ్చి ఇప్పటికే రెండేళ్లు దాయిపోయినా మరొక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు.
ఫిదా లాంటి మరో అందమైన ప్రేమకథలో చై మరియు సాయి పల్లవిలను పెట్టి మరో ప్రయోగం చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ సీన్ రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో చేసిన ప్రయోగం కాస్త అభిమానులు, స్మార్ట్‌ఫోన్ కారణంగా బెడిసికొట్టింది. ఓ సీన్‌లో భాగంగా సాయి పల్లవి వేగంగా నడుస్తూ ఓ ఇంట్లోకి వెళ్లిపోవాలి. ఇందుకోసం నగరంలోని పద్మారావ్ నగర్‌ను ఎంచుకున్నాడు శేఖర్. రోడ్డుపై నడుస్తూ ఓ ఇంట్లోకి సాయి పల్లవి వెళ్లిన దృశ్యాన్ని అభిమానులు ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు