Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మర్డర్ ఏ ఒక్కరి కుటుంబ కథ కాదు, కల్పిత కథ: రామ్ గోపాల్ వర్మ

Advertiesment
మర్డర్ ఏ ఒక్కరి కుటుంబ కథ కాదు, కల్పిత కథ: రామ్ గోపాల్ వర్మ
, శనివారం, 7 నవంబరు 2020 (22:25 IST)
మర్డర్ ట్రైలర్ విడుదలైన తరవాత ఈ సినిమాపై వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా తన కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా రూపొందించారని, దాని విడుదలను ఆపాలని అమృతా ప్రణయ్ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ‘మర్డర్’ విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ ‘మర్డర్’ నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమృత, ప్రణయ్, మారుతీరావు పేర్లను వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. నల్గొండ కోర్టు విధించిన స్టేను కొట్టివేసింది.
 
హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రావడంతో రామ్ గోపాల్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అమృత, ప్రణయ్‌ల కథను తాను సినిమాగా తీయలేదని.. అలాంటి ఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా చేశానని వర్మ స్పష్టం చేశారు. అయితే, గతంలో అమృత ఫొటోను ఎందుకు ట్వీట్ చేశారని.. ఆ ఘటన గురించి ఎందుకు ప్రస్తావించారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు వర్మ.
 
అమృత కథ ఆధారంగా సినిమా చేయడం వల్ల ఆమె కుటుంబంపై ప్రభావం పడుతుంది కదా అని అడిగిన ప్రశ్నకు వర్మ స్పందిస్తూ.. ‘‘ఇది ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో వచ్చింది. మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. రోజుకి బోలెడన్ని సార్లు వేశారు. ఆ కథ ఆధారంగా నేను సినిమా చేస్తే కొత్తగా జరగడానికి ఏముంటుంది. నేను ఒకరిని కించపరచడానికి ఈ సినిమా తీయలేదు. ఒకరు కరెక్ట్ మరొకరు రాంగ్ అని చెప్పడంలేదు. అలాంటి సంఘటన ఎందుకు జరుగుతుంది అనే విశ్లేషణే నా సినిమా’’ అని క్లారిటీ ఇచ్చారు.
 
తాను తీసిన సినిమా అమృత కుటుంబం గురించి కాదని.. అలాంటప్పుడు వాళ్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని వర్మ చెప్పారు. ‘‘వాళ్ల బెడ్‌రూంలోకి వెళ్లి.. కిచెన్‌లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు.. ఇది కాదు సినిమా. వాళ్లతో, వాళ్ల కథతో నాకు సంబంధం లేదు. ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సంవత్సరంలో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. వాటిలో కొన్ని పాపులర్ అవుతాయి కొన్ని కావు’’ అని వర్మ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నట్టికుమార్, నట్టి కరుణ , ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌కి కేసీఆర్ దీపావళి బంపర్ గిఫ్ట్: 2 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీ