Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్‌కి కేసీఆర్ దీపావళి బంపర్ గిఫ్ట్: 2 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీ

టాలీవుడ్‌కి కేసీఆర్ దీపావళి బంపర్ గిఫ్ట్: 2 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీ
, శనివారం, 7 నవంబరు 2020 (19:07 IST)
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
 
అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చని సిఎం ప్రకటించారు. సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్‌లో సిఎం ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
 
‘‘తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యలో విధించిన లాక్ డౌన్ వల్ల అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
 
ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగులు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
 
ఎవరినైనా ఒడిలో చేర్చుకునే గుణం ఉంది. షూటింగులతో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ రాపాక ప్రధాన పాత్రలో హెల్పింగ్ హ్యాండ్ క్రియేషన్స్ చిత్రం "కాత్యాయని"