తనకు కౌబాయ్ చిత్రాలంటే అమితమైన ఇష్టమని, ఇలాంటి చిత్రాల్లో నటిస్తానని తాను ఊహించలేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 35 యేళ్ల క్రితం చిరంజీవి నటించిన చిత్రం 'కొదమ సింహం'. 1990లో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ప్రీమియర్ ప్రదర్శించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చిరంజీవి ఈ చిత్రంతో తనకున్న అనుబంధాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
''కొదమసింహం'లోని నా స్టిల్ చాలా పాపులర్. ఆ లుక్‌ను నేను బాగా ఇష్టపడటంతో నిర్మాతలు దాన్ని ఫ్రేమ్ చేసి కానుకగా ఇచ్చారు. మా ఇంట్లో ఇప్పటికీ ఉంది. నేను కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. అప్పటికి కృష్ణ నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' రికార్డులు సృష్టించింది. అలాంటి నేపథ్యంతో మరో సినిమా చేయడం సాహసమనే చెప్పాలి. నిర్మాత కైకాల నాగేశ్వర రావు.. కౌబాయ్ కథతో మీతో ఒక కొత్త తరహా మూవీ చేయాలని ఉందంటూ డైరెక్టర్ మురళీ మోహన్ రావును పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చి నటించేందుకు వెంటనే అంగీకరించా. తొలిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది.
మోహన్‌బాబు పోషించిన సుడిగాలి పాత్ర నా ఫేవరెట్. విభిన్న పార్శ్వాలున్న ఆ పాత్రకు మోహన్‌బాబు తప్ప మరొకరు న్యాయం చేయలేరనిపించింది. లెజెండరీ యాక్టర్ ప్రాణ్‌తో కలిసి నటించే అదృష్టం ఈ సినిమాతో దక్కింది. రాజ్ - కోటి అద్భుతమైన సంగీతం అందించారు. ప్రభుదేవా చక్కటి కొరియోగ్రఫీ చేశాడు. ఓ పాటలో ఫ్లోర్ నుంచి గోడపైకి స్టెప్స్ వేస్తూ మళ్లీ ఫ్లోర్ మీదకు వస్తా. దాన్ని ఎలా చేశారంటూ అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు.
ఓ హాలీవుడ్ మూవీలోని సీన్ స్ఫూర్తితో అది షూట్ చేశాం. రామ్ చరణ్‌కూ ఈ సినిమా ఎంతో ఇష్టం. చిన్నప్పుడు వాళ్లమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ భోజనం చేసేవాడు కాదు. ఈతరం ప్రేక్షకులూ ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.