కేంద్ర మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలుసుకున్నారు. ఆస్కార్ వేదికపై అవార్డును అందుకున్న తర్వాత రామ్ చరణ్ శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించడంతో శుక్రవారం రాత్రి ఆయన్ను కలుసుకున్నారు. తొలుత చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ అమిత్ షాకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. ఆ తర్వాత రామ్ చరణ్‌కు అమిత్ షా శాలుపా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా ఓ ట్వీట్ చేస్తూ, భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగ చిత్రపరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని చెప్పారు. "ఆర్ఆర్ఆర్" అద్భుత విజయం. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు చరణ్‌కు అభినందనలు అనిఅన్నారు. కాగా, శనివారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీ వేదికగా ఇండియా టుడే ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుగనుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటారు.