మెగాస్టార్ చిరంజీవి మంచి జోరుమీదున్నారు. "గాడ్‌ఫాదర్"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రేక్షకులను ఖుషీ చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇదే ఊపుతో సంక్రాంతికి సిద్ధమవుతున్నారు. "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెఢీ అయ్యారు. ఇది చిరంజీవి నటించిన 154వ చిత్రం. హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. బాబీ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాకథనాలతో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి పక్కా ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన యాస, డైలాగ్ డెలివరీ, లుక్ విభిన్నంగా ఉండనున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో ఇది సంక్రాంతికి విడుదల కాకపోవచ్చన్న సంకేతాలు వచ్చాయి. కానీ, ఇపుడు సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైపోయినట్టుగా మేకర్స్ అప్ డేట్ వదిలారు. సాధారణంగా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకున్న తర్వాతనే డబ్బింగ్ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉంటారు. అందువలన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు అయింది.