భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగంలో చిరు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న దేశంలోని అతిపెద్ద నటులలో చిరంజీవి గారు ఒకరు.
మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు 2006లో దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను అందుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఆయనకు పద్మ విభూషణ్ లభించింది.