Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడిబొచ్చు అమ్ముకునేవాళ్ళకు తిరుపతి ప్రజలు ఓటేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రశ్న

pawan kalyan

ఠాగూర్

, బుధవారం, 8 మే 2024 (13:24 IST)
కోడిబొచ్చు అమ్ముకునే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడుకు ఓటు వేస్తారా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఓటర్లను సూటిగా ప్రశ్నించారు. తిరుపతిలో మంగళవారం రాత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి విజయయాత్ర సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. వైకాపా నేతలను తూర్పారబట్టారు. విమర్శలు గుప్పించారు. ఏడుకొండలవాడికి గోవిందా గోవింద అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 
 
'ఇక్కడే పెరిగి, గల్లీగల్లీ తిరిగి, స్టూడెంట్ రాజకీయాలు చేసి, ఎస్వీ యూనివర్సిటీలో స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేసి, అలిపిరిలో బాంబు పేలుడుతో 16 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా, వెంటనే లేచి దుమ్ము దులుపుకుని ముందుకు నడిచిన నేత చంద్రబాబు అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందుండి నడిపిస్తున్న టీడీపీ అధినేతకు అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
 
'టీడీపీ నేతలకు, బీజేపీ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. కూటమి అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులును భారీ మెజారిటీతో గెలిపించాలి. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయనను కూడా గెలిపించాలి. చంద్రగిరి నుంచి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి.
 
ఇక్కడ కరుణాకర్ రెడ్డి (భూమన) ఉన్నారు. వాళ్లబ్బాయి మీకు ఎమ్మెల్యేగా కావాలా? ఆఖరికి కోడిబొచ్చు కూడా అమ్ముకుంటున్నారు... ఇలాంటి వాళ్లు మీకు కావాలా? లేదంటే ... మోడీ, చంద్రబాబు, జనసేన మద్దతుతో బలంగా నిలబడిన ఆరణి శ్రీనివాసులు కావాలా? ఆ రోజు మీరు మెగాస్టార్ చిరంజీవిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించారు. చంద్రబాబుని ఒక్కటే కోరాను... తిరుపతి పవిత్రతను కాపాడుకుంటా, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, కులాలకు, మతాలకుభేదాలు చూడకుండా అందరినీ సంరక్షించుకుంటాం అని చెప్పాను. అందుకు కూటమి తరపున చంద్రబాబు పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
 
వైసీపీ ప్రభుత్వ ఇక్కడి నుంచి అమరరాజాను తరిమేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరరాజాను తీసుకువస్తాం. ప్రజలు గనుక కరుణాకర్ రెడ్డికిగానీ, వాళ్లబ్బాయికిగానీ ఓటేస్తే... ప్రతి దాంట్లో 10:30 నిష్పత్తిలో పంపకాలు చేసుకుంటారు. ఇల్లు కట్టాలంటే 10 శాతం కొడుక్కి, 30 శాతం తండ్రికి చెల్లించాల్సిందే! ఎంతకాలం భయపడతాం... ఏడు కొండలవాడినిపైన ఉంచుకుని మనం భయపడతామా? ఉక్కుపాదంతో ఆకురౌడీలందరినీ తొక్కి పడేస్తాం. కరుణాకర్ రెడ్డి, వాళ్లబ్బాయి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి... శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లన్నింటిని నరికేశారు. రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కాం జరిగింది... డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఈ పరిస్థితి మార్చుకోవాలంటే కూటమి ప్రభుత్వం రావాలి అంటూ పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా గర్జించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీలక నిర్ణయం తీసుకున్న మాయావతి... మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌పై వేటు!!