అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవిగారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం చేశారు. మెగా మనసును చాటుకున్నారు. మార్చిలో ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ సభ్యులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డులు అందజేసిన విషయం తెలిసిందే.
ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిగారిని ఆహ్వానించగా… ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన రాలేనని తెలిపారు. అసోసియేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవిగారు, బుధవారం ఉదయం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. అడగకుండానే తనవంతు సహాయం చేసి జర్నలిస్ట్‌లను ఆనందంలో ముంచెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సినిమా ప్రముఖులకు, ప్రేక్షకులకు టెలివిజన్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు వారధి లాంటివారు. ఈ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కృషి ప్రశంసనీయం. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం నాకు నచ్చింది. అలాగే, ఈ అసోసియేషన్ చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నావంతుగా కొంత సహాయం చేస్తున్నాను. నేను ఇచ్చిన మొత్తాన్ని హెల్త్ కార్డుల కోసం వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే, జర్నలిస్టులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను, మా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను” అని అన్నారు.