టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం గురించి ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, సైరా చిత్రంతో తన సుధీర్ఘ కల నెరవేరిందన్నారు.
అదేసమయంలో తన కొత్త చిత్రాలపై స్పష్టత ఇచ్చారు. 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభమై... నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ షురూ అవుతుందన్నారు. అయితే ఈ చిత్రంలో తాను ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు.
అలాగే, త్రివిక్రమ్ సినిమా విషయమై మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం త్రివిక్రమ్ నాకు ఓ కథ వినిపించారు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, వచ్చే యేడాది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలే తన ఖాతాలో ఉన్నాయని చెప్పారు.
ఈ సినిమాల సంగతులు పూర్తయిన తర్వాత, రాజకీయాల గురించి మీడియా ప్రతినిధి చిరంజీవిని ప్రశ్నించారు. ఇంతకీ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అని మీడియా ప్రతినిధి చిరంజీవిని అడగ్గా, నేనిప్పుడు ఉన్నది సినిమా పార్టీలో అంటూ నవ్వేశారు.
'సైరా' వంటి భారీ చారిత్రక చిత్రం పూర్తవడంతో ఎంతో రిలాక్స్‌డ్‌గా ఉన్నానని చిరు వెల్లడించారు. ఇక, తాను బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టంచేశారు.