శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను సర్వనాశనం చేసింది. అనేక గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేవు. ఈ గ్రామాల్లో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో తిత్లీ ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ శ్రీకాకుళం ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. తానున్నానంటూ అభయ హస్తం ఇచ్చారు. తిత్లీ తుఫాను ప్రభావిత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తన బాబాయ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని వెల్లడించారు. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారనే విషయం త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. గ్రామం దత్తత విషయంపై తన బృందంతో చర్చించానన్నారు. ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నది తాను నియమించిన బృందం గుర్తిస్తుందని, ఆ తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రామ్ చరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.