మీనాక్షి చౌదరి. తెలుగు చిత్రపరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో ఒకరు. తన అభినంతో కంటే అందంతో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. మీనాక్షి అందంతో పాటు.. గ్లామర్ అంశాలు ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు ఇవ్వొచ్చన్న అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలకు కల్పిస్తుంది.
ఎలాంటి హడావిడి లేకుండా తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఆ తర్వాత రవితేజ సరసన ఆమె 'ఖిలాడీ' సినిమాలో మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కాలేదు .. కాకపోతే ఆమె గ్లామర్ టచ్ ఆడియన్స్‌కి గుర్తుండిపోయింది. ఆ తరువాత చేసిన 'హిట్ 2' సక్సెస్ ఆమెను మరో మెట్టు ఎక్కించింది.
ఈ నేపథ్యంలోనే ఆమె 'గుంటూరు కారం' చేసింది. 'గుంటూరు కారం'లో మహేశ్ బాబు మరదలుగా మీనాక్షి కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. కానీ అంతకుముందు కంటే ఈ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెను మెయిన్ హీరోయిన్‌గా తీసుకోవచ్చనే నమ్మకాన్ని కలిగించినది ఈ సినిమానే. ఏదో అలా నెమ్మదిగా పుంజుకుంటుందేమోనని అనుకుంటున్న సమయంలో ఆమె ఏకంగా విజయ్ సినిమా 'ది గోట్'లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
మీనాక్షి కెరియర్‌లో ఇదే పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. విజయ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడమనేది అంతతేలికైన విషయమేం కాదు. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా హిట్ కొడితే మీనాక్షి గ్రాఫ్ ఒక రేంజ్‌లో పెరిగిపోవడం ఖాయం. విష్వక్ జోడీగా ఆమె చేసిన 'మెకానిక్ రాకీ'.. వరుణ్ తేజ్ సరసన చేసిన 'మట్కా' కూడా అక్టోబరులో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలతో మీనాక్షి మరో స్థాయికి చేరుకుంటారని భావిస్తున్నారు.