Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోయపాటి శ్రీనుకు సవాల్ విసిరిన చిరంజీవి.. ఎందుకో తెలుసా?

chiranjeevi - balakrishna

ఠాగూర్

, సోమవారం, 2 సెప్టెంబరు 2024 (13:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఫ్యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో సెన్షేషనల్ దర్శకుడిగా గుర్తింపు పొందిన బోయపాటి శ్రీనుకు మెగాస్టార్ చిరంజీవి ఓ బహిరంగ సవాల్ విసిరారు. తాను, బాలకృష్ణలు కలిసి నటించేలా కథను సిద్ధం చేసే సవాల్‌ను బోయపాటి స్వీకరించాలని ఎన్బీకే50 వేడుకల్లో బహిరంగంగా కోరారు. అంతేకాకుండా, తాను ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బాలకృష్ణ ఆదర్శమన్నారు. 
 
బాలయ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... సినీపరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ స్వర్ణోత్సవ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, 'సమరసింహారెడ్డి' సినిమా స్ఫూర్తితోనే తాను 'ఇంద్ర' సినిమా చేశానని చెప్పారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలనే కోరిక తనకు ఉందని, ఖచ్చితంగా చేస్తానని తన మనసులోని ఆకాంక్షను వెల్లడించారు. 
 
బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని... యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుకన్నారు. బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్‌కు ప్రజల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని... తండ్రి చేసిన పాత్రలను ఆయన వారసుడిగా బాలయ్య చేసి, ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదన్నారు. 
 
తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. మరో 50 ఏళ్లు హీరోగా నటించే ఘనత బాలయ్య సొంతమని చిరంజీవి అన్నారు. భగవంతుడు ఇదే శక్తిని ఆయనకు ప్రసాదించాలని... బాలయ్య 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కుంటున్నానని తెలిపారు. 
 
పైగా, తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారని... తమతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారని చిరంజీవి తెలిపారు. ఫ్యాన్స్ అనవసరంగా గొడవ పడుతుంటారని... హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుందని తెలియజేసేందుకు తాము కొన్ని వేడుకలు కూడా చేసుకునేవాళ్లమన్నారు. అలాంటి కార్యక్రమాల వల్ల అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారని తెలిపారు. తామంతా ఒక కుటుంబంలాంటి వాళ్లమని... ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. ఓజీపై అప్డేట్స్ లేవు..