ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం మృతి చెందారు. ఆయనకు వయసు 55 యేళ్లు. ఆయన మరణ వార్తలు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయన కొచ్చిన్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో నటించడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.
కాగా, 1990లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన 'డాక్టర్ పశుపతి' అనే చిత్రంలో రిజాబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్ ఇన్ హరిహర్ నగర్లో జాన్ హొనై పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుండి ఆయన దశ తిరిగిపోయింది. రిజబావా తన సినీ కెరీర్‌లో దాదాపుగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. అనేక టీవీ సీరియల్స్‌లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన వన్ చిత్రంలో నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.