ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే ప్రధాన ధ్యేయంగా చిత్ర పరిశ్రమలోకి మహీంద్రా పిక్చర్స్ నిర్మాణ సంస్థ కొత్త ఆశలతో అడుగు పెట్టింది. ఈ సంస్థ కార్యాలయ ప్రారంభోత్సవం హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగింది. తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన సస్పెన్స్, థ్రిల్లర్ కథను ఎంచుకుని సినీ జనాల ముందుకు వస్తోంది.. అందులోనూ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మాత వల్లూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. చిన్నా వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సమర్పకుడుగా సాయి కార్తిక్ జాడి వ్యవహరిస్తున్నారు.
సినిమా గురించి నిర్మాత వల్లూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండాలని సస్పెన్స్, థ్రిల్లర్ కథను ఎంచుకున్నాం . అంతేకాదు.. ఇది ఓ అందమైన ప్రేమకథా చిత్రం కూడా. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నాం . త్వరలోనే చిత్రీకరణ మొదలుకానుంది' అని పేర్కొన్నారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ.. 'కొత్త కంటెంట్ తో ఈ సినిమా ఉంటుందని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే కథలో చాలా వైవిధ్యమైన కోణాలున్నాయి. అంతేకాకుండా కొత్త దర్శకుడు చిన్నాను ఓటీటీ సంస్థలు కూడా ఆహ్వానం పలికాయి. కానీ థియేటర్‌లో రావాలనే ఆయన ఆశలకు అనుగుణంగా ఈ సినిమాను పెద్ద చిత్రంగా రూపొందిస్తున్నాం.
అందుకే సొంత బ్యానరులో రెండు భాషల్లో చిత్రీకరిస్తున్నాం. ఇందులో ఇరు భాషల తారలు నటిస్తున్నారు. చిత్రీకరణ కూడా రెండు భాషల్లో చేస్తున్నాం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల వివరాలను వెల్లడిస్తాం' అని పేర్కొన్నారు.