చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, చిరు తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన మొదటి సినిమాతోనే తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. మొదటి సినిమాతో హిట్ అందుకుని తన రెండవ సినిమా మగధీర తో తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను లిఖించాడు చరణ్.
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం విధితమే. కానీ 13 ఏళ్ల క్రితమే అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ అథినేత, మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తన దగ్గరున్న మొత్తాన్ని "మగధీర" సినిమా కోసం వెచ్చించారు. దానికి మూడింతలు మగధీర సినిమా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్ అంతా పుష్కలంగా ఉన్న సినిమా మగధీర.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని కాలభైరవ, మిత్రబింద కేరక్టర్స్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికి, ఎప్పటికి చిరస్థాయిగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మగధీర సినిమా మళ్ళీ ఇప్పుడొస్తే ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా, అదే జరగబోతుంది. మార్చ్ 27 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. అప్పుడు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న "మగధీర" చిత్రం మరోమారు ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది.