తెలుగు చిత్రపరిశ్రమపై సినీ నటి, బీజెపీ మహిళా నేత మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ సంస్కృతి ఉందని చెప్పుకొచ్చారు. ఆ డ్రగ్ రాయుళ్ళపై ఓ కన్నేసి ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ మాఫియా హస్తముందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా, ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ డ్రగ్స్ వాడేవాడన్న ఆరోపణల నేపథ్యంలో, వాటిని రియా స్వయంగా తీసుకెళ్లి ఇచ్చేదని, ఓ డీలర్‌తో ఆమె ఫోన్ సంభాషణలు జరిపిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో బీజేపీ నేత, నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ డ్రగ్స్ దందా సాగుతోందని చెప్పారు. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్‌ను వాడుతుంటారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు దృష్టిని సారించాలని కోరింది. టాలీవుడ్ నటీనటులను వదిలేయకుండా, సీరియస్‌గా తీసుకుని విచారించి, ఈ దందాను అంతం చేయాలని కోరారు.
ఆ మధ్య టాలీవుడ్ డ్రగ్స్ దందా కేసు వెలుగులోకి రాగా, విచారణ జరిపిన అధికారులు, పలువురు సినీ ప్రముఖులను విచారించి, చివరికి వారి ప్రమేయం లేదని తేల్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిందితులు కాదని, బాధితులేనని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఆపై ఇంతకాలానికి మాధవీలత మరోసారి ఇదే దందాను గుర్తు చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.