Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్కీ భాస్కర్ నుంచి వినసొంపైన మెలోడీతో .. కోపాలు చాలండి శ్రీమతి గారు గీతం విడుదల

Dulquer Salmaan  Meenakshi

డీవీ

, బుధవారం, 19 జూన్ 2024 (11:21 IST)
Dulquer Salmaan Meenakshi
"మహానటి", "సీతా రామం" ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
 
''లక్కీ భాస్కర్'' సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి గీతాన్ని జూన్ 19వ తేదీన చిత్ర బృందం ఆవిష్కరించింది.
 
జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. వయోలిన్ తో మొదలై, ఫ్లూట్ మెలోడీగా మారి, డ్రమ్ బీట్‌లతో మరో స్థాయికి వెళ్లి.. జి.వి. ప్రకాష్ కుమార్ ప్రత్యేక శైలిలో ఎంతో అందంగా సాగింది ఈ పాట. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు.
 
గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం, ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. కోపగించుకున్న భార్య పట్ల భర్తకు గల వాత్సల్యాన్ని తెలుపుతూ, "చామంతి నవ్వు", "పలుకే ఓ వెన్నపూస" వంటి పదబంధాలను ఉపయోగిస్తూ, గాఢమైన ప్రేమను వ్యక్తీకరించారు.
 
దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం "సార్"లో స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్, గాయని శ్వేతా మోహన్ కలయికలో వచ్చిన "మాస్టారు మాస్టారు" గీతం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ "శ్రీమతి గారు" గీతం కూడా ఆ స్థాయి విజయాన్ని సాధించి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు.
 
1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ''లక్కీ భాస్కర్'' చిత్రంలో చూడబోతున్నాం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. 
 
'లక్కీ భాస్కర్' చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళా దర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి - శ్రీరెడ్డి పోస్ట్ వైరల్