Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టినప్పుడే స్పృహ కోల్పోయారు, తొలి సినిమా చేజారిపోయింది: కృష్ణ జ్ఞాపకాలు

krishna
, మంగళవారం, 15 నవంబరు 2022 (08:07 IST)
krishna
తెనాలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బుర్రిపాలెంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు సుందరరామయ్య ఆసుపత్రిలో జన్మించారు కృష్ణ.  1943 మే31 మధ్యాహ్నం 12.30 గంటలకు పుట్టారు. ఆయన పుట్టిన 38వ రోజున తీవ్రమైన జ్వరం రావడంతో మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మూడు రోజులపాటు స్పృహలేకుండా ప్రమాదకర పరిస్థితిలో వున్న కృష్ణను డాక్టర్‌ సుందరరామయ్య కృష్ణను మామూలు స్థితికి తెచ్చారు.
 
నాగరత్నమ్మగారికి ఎంతోకాలంగా పిల్లలు లేకపోవడంతో పెదకాకానిలో శివునికి ప్రదక్షిణాలు చేసేది. ఆయన వరప్రసాదంగా శివ, తాతగారి పేరు కలిసేలా రామ. కృష్ణతులసికి పూజలు ఇంట్లో చేయడం సెంటిమెంట్‌గా కృష్ణమూర్తి అని మూడు పేర్లు కలిసివచ్చేలా నామకరణం చేశారు. అదే శివరామ కృష్ణ. 
 
ఘట్టమనేని కృష్ణ సినిమాల్లో హీరో కావాలని చెన్నపట్నం (మదరాసు) వచ్చారు. అది 1963 జనవరి నెల. మదరాసు పాండీ బజార్‌లో ఓ యువకుడు, ఓ మధ్య వయస్కుడు నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ బాటలో వెళుతున్న ఓ పెద్దమనిషి కారులో వెళుతూ వీరిని చూసి దగ్గరకు వచ్చాడు. ఎర్రగా బుర్రగా వున్న ఆ యువకుడిని చూసి తెలుగా? తమిళా? అని అడిగాడు. వెంటనే మధ్యవయస్కుడు తెలుగే అన్నాడు. 
 
సినిమాల్లో నటించాలనుందా? అని కారులోని పెద్దమనిషి అడిగాడు. అందేకేగా నేను మదరాసు వచ్చింది అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు యువకుడు. ఆయనే కృష్ణ. పక్కనున్న మధ్యవస్కుడు రచయిత కొడవగంటి కుటుంబరావు. కారులో వచ్చిన వ్యక్తి దర్శకుడు శ్రీధర్‌. ఆ సమయంలో దర్శకుడు కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా తీస్తున్నాడు. రేపు ఆఫీసుకు వచ్చి కలువు. నువ్వే నా సినిమా హీరో అన్నాడు దర్శకుడు.
 
కృష్ణకు సంతోషం కలిగినా తమిళంరాదని సందేహంలో నాకు తమిళంరాదు అనేశాడు. అది నాకు వదిలేయ్‌. నేను చూసుకుంటానని దర్శకుడు శ్రీధర్‌ చెప్పి వెళ్ళిపోయాడు.ఇక మర్నాడునుంచీ ట్యూటర్‌ను పెట్టి తమిళం నేర్పించారు. వారంరోజులు గడిచినా ఒక్కముక్క కృష్ణకు అబ్బలేదు. దర్శకుడు శ్రీధర్‌ ఇక లాభంలేదని రవీంద్రనాథ్‌ అనే మరొకరిని హీరోగాబుక్‌ చేశారు. ఇక ఆ చిత్రాన్నే తెలుగులో సి.పుల్లయ్య దర్శకత్వంలో ప్రేమించి చూడుగా తీశారు. అందులో ఎ.ఎన్‌.ఆర్‌. హీరో. 
 
ఈ పరిణామం వల్ల మంచే జరిగింది. అదేగనుక కృష్ణ తమిళం నేర్చుకుని వుంటే తమిళరంగానికి అంకితం అయ్యేవాడని అతని మిత్రుడు కొడవగంటిగారు అనేవారు. ఆ ఛాన్స్‌ మిస్‌ కావడంతో తేనెమనసులు హీరో అయ్యాడు. ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఎన్నో సంచనాలకు తెరలేపాడు. కలర్‌, ఈస్ట్‌మన్‌ కలర్‌, 70.ఎం.ఎం. చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కృష్ణ నిలిచాడు. జేమ్స్‌బాండ్‌ చిత్రాలకు ఆద్యుడయ్యాడు. తెలుగులో కొత్త ప్రయోగాలు చేసిన స్టార్‌గా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బుర్రిపాలెం బుల్లోడు' అసలు పేరేంటి? జీవిత నేపథ్యం...