బెర్లిన్‌లో నిర్వహించిన వరల్డ్ హెల్త్ సమ్మిట్-2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతిసనన్ నిలిచారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ వారి వైద్యం కోసం సరిపడినన్ని నిధులు ఉండటం లేదన్నారు.
మహిళల ఆరోగ్యంతోపాటు లింగ సమానత్వం కోసం అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యమనేది తేలిగ్గా తీసుకునే అంశం కాదని, మానవాళి భవిష్యత్తుకు మూలస్తంభం లాంటిదని పేర్కొన్నారు. 'ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్' ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి సెప్టెంబరులో ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇకపోతే, కృతి సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ హీరో ధనుష్ సరసన ఆమె నటించిన తేరే ఇష్క్ మే అనే హిందీ చిత్రం, ఈ ప్రేమకథా చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకురానుంది. షాహిద్ కపూర్‌తో కలిసి కృతి నటిస్తున్న కాక్‌టెయిల్ 2 వచ్చే ఏడాది విడుదల కానుంది.